
స్టాండ్స్‌లోకి వెళ్తే కొత్త బంతే..
ఐపీఎల్ 2021 ఫేస్ 2కు సంబంధించి 41 పేజీలతో కూడిన బయో బబుల్ ప్రొటోకాల్స్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌లో కథనం ప్రకారం, ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్‌లోకి సిక్స్‌గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించరు. ఆ బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకొస్తారు. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు పట్టుకునే అవకాశం ఉన్నందున.. తిరిగి అదే బంతిని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉన్నది. అందుకని స్టాండ్‌కు వెళ్లే బంతిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత బాల్ లైబ్రరీలో దాచనున్నారు. ఈసారి ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

బ్యాట్స్‌మన్‌కు పండగే..
స్టాండ్స్‌లో పడిన బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకొస్తే బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది. ఎందుకంటే కొత్తబంతి హార్డ్‌గా ఉంటూ సులువుగా బ్యాట్‌పైకి వస్తుంది. పైగా యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. కానీ ఈ నిబంధన కారణంగా వారు కొత్త బంతి వచ్చిన ప్రతీసారి దానికి అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బంతిపై పట్టుచిక్కకుండా పోతుంది. ఏదీ ఏమైనా ఈ నిబంధన బౌలర్లకు పెద్ద శిక్షేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే బ్యాట్స్‌మెన్‌కు ఫేవర్‌గా మారిన ఈ టీ20ల్లో ఈ తరహా కొత్త నిబంధనలతో బౌలర్లు మరింత బలహీనం అవుతారని అభిప్రాయపడుతున్నారు.

శ్రీలంక టూర్ ఎఫెక్ట్..
శ్రీలంక పర్యటనలో ఎదురైన చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ కొత్త బయో బబుల్ ప్రొటోకాల్స్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 జట్టులో సభ్యుడైన కృనాల్ పాండ్యా కరోనా వైరస్ బారిన పడటం.. అతనితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది క్రికెటర్లు ఐసొలేషన్‌లోకి వెళ్లడం, వారిలో యుజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌కు వైరస్ సోకడం వంటి పరిణామాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి. సునాయసంగా గెలిచే సిరీస్‌లో పరాజయం కావాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ బీసీసీఐపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు స్పష్టమవుతోంది.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలే..
కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారు ఎలాంటి వారైనా.. ఎంతటి వారైనా.. ఉపేక్షించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. చివరికి- ఫ్రాంఛైజీలు, టీమ్ మేనేజ్‌మెంట్లను కూడా వదలదలచుకోలేదు. క్రికెటర్ల భార్యాపిల్లలు, వారి కుటుంబ సభ్యుల పైనా కఠిన చర్యలను తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. బయోబబుల్ సెక్యూర్‌ను ఉల్లంఘించితే- ఫ్రాంచైజీలు, క్రికెటర్ల కుటుంబ సభ్యులు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- భారత్‌లో నిర్వహించాల్సిన ఈ టోర్నమెంట్‌ను యూఏఈకి తరలించాల్సి వచ్చిందని బీసీసీఐ గుర్తు చేసింది. అక్కడ కూడా ఇదే వాతావరణం నెలకొనడాన్ని నివారించడానికి కొత్త బయోబబుల్ ప్రొటోకాల్స్‌ను కఠినంగా రూపొందించాల్సి వచ్చిందని తెలిపింది. బయోబబుల్ నిబంధనలను అమలు చేసే విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ కావాల్సిందే..
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, సభ్యులందరూ కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులను అందజేయాల్సి ఉంటుందని బీసీసీఐ తన కొత్త బయోబబుల్ ప్రొటోకాల్స్‌లో స్పష్టం చేసింది. యుఏఈ విమానం ఎక్కడానికి 72 గంటల ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్‌ను అందజేయడాన్ని తప్పనిసరి చేసింది. విదేశీ ప్లేయర్లు గానీ, దేశీయ క్రికెటర్లు గానీ.. ఫ్రాంఛైజీలతో కలిసి లేదా వేర్వేరుగా తమకు దగ్గరగా ఉన్న విమానాశ్రయాల నుంచి యుఏఈకి రావొచ్చని బీసీసీఐ పేర్కొంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు 48-72 గంటల ఆర్టీపీసీఆర్ నివేదికను చూపించాల్సి ఉంటుందనే నిబంధనను అనుసరించాలని సూచించింది.

రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే..
ఐపీఎల్ 2021లో పాల్గొనడానికి విమానం ఎక్కే ప్రతి సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్.. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలని సూచించింది. ఐపీఎల్ 2021 ఫేస్ 2తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలని పేర్కొంది. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ ఐపీల్ 2021ను యుఏఈలో నిర్వహించేలా రీషెడ్యూల్ చేసినందు వల్ల అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బీసీసీఐకి అందజేయాలని తెలిపింది. బయోబబుల్ నిబంధనలు, మార్గదర్శకాలను మాత్రం ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని, దీన్ని విస్మరించవద్దని సున్నితంగా హెచ్చరించింది.


Click it and Unblock the Notifications












