India Tour of England:టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక.. అదే జరిగితే వారందరూ ఇంగ్లండ్ టూర్‌కు దూరమే!!

ముంబై: జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఆపై ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఎంపికయిన టీమిండియా ఆటగాళ్లకు భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పర్యటనలకు బయలుదేరే ముందు.. ముంబైలో జరిగే కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలిన ఆటగాడు భారత జట్టుకు దూరమవుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఈ నిబంధనలు కేవలం ఆటగాళ్లకు మాత్రం కాదు వారి కుటుంబ సభ్యులు మరియు సహాయక సిబ్బంది కూడా వర్తించనున్నాయి. ముంబైకి చేరుకునే వరకు ఐసొలేషన్‌లో ఉండి తమను తాము వైరస్ బారినుంచి కాపాడుకోవాలని భారత జట్టు ఫిజియో యోగేశ్ పర్మార్ ఆటగాళ్లకు సూచించారు.

ఐపీఎల్ వాయిదా నేపథ్యంలో
ఇంగ్లండ్‌కు వెళ్లే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ముంబైలోని హోటల్‌లో దిగిన మొదటి రోజు ఆర్టీ-పీసీఆర్ టెస్టును బీసీసీఐ నిర్వహించనుంది. ఆపై మరోసారి పరీక్షలు చేస్తారు. ఇక ముంబై చేరుకోవడానికి ముందు కూడా అందరూ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగటివ్ రిపోర్ట్ వస్తేనే.. ముంబైకి పయనమవ్వాల్సి ఉంటుంది. ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ 2021 వాయిదా పడిన నేపథ్యంలో బీసీసీఐ కఠిన నియమాలను అమలుచేస్తోంది. ముంబైలో పటిష్ట బబుల్ ఏర్పాటు చేస్తోందట.

పాజిటివ్ వస్తే
'వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఎంపికయిన భారత ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి బీసీసీఐ నుంచి ఇప్పటికే ఓ సందేశం వెళ్లింది. ముంబైకి చేరుకునే వరకు ఐసొలేషన్‌లో (ఇంట్లోనే జాగ్రత్తగా) ఉండమని కోరాం. ముంబై వచ్చే ముందు ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేసుకోవాలి. ముంబై వచ్చిన మొదటి రోజు టెస్ట్ నిర్వహిస్తాం. ఒకవేళ ఏ ఆటగాడైనా పాజిటివ్ వస్తే.. అతడిని పరిగణలోకి తీసుకోము. ఎందుకంటే.. బీసీసీఐ ఏ క్రికెటర్ కోసం మరో ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేయదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ వెళ్లనుంది.
IPL Bio-Bubble: బుడగ బద్దలవడానికి మరో కారణం వెలుగులోకి.. అదే ఐపీఎల్ 2021 కొంపముంచిందా?!

కోవిషీల్డ్ టీకా వేయించుకోవాలి
'ముంబై నుంచి ఇంగ్లండ్ బయలుదేరే ముందు అందరికి రెండుసార్లు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నిర్వహిస్తాం. రెండిటిలో సానుకూల ఫలితాలు రావాలి. అప్పుడే ఆ ఆటగాడు బుడగలోకి ప్రవేశిస్తాడు. ముంబై చేరుకోవడానికి ఆటగాళ్లకు విమానంలో లేదా కారులో ప్రయాణించే అవకాశం కూడా ఇచ్చాం. ఇంగ్లండ్ టూర్‌కి ఎంపికైన క్రికెటర్లు కోవాక్సిన్ కాకుండా కోవిషీల్డ్ టీకా వేయించుకోవాలని బీసీసీఐ సూచించింది.
ఎందుకంటే..ఇప్పుడు టీకా వేయించుకున్న క్రికెటర్లు మళ్లీ నెల రోజుల తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోవాక్సిన్ వేయించుకుంటే.. ఇంగ్లండ్‌లో ఆ టీకా దొరకడం కష్టం. కోవిషీల్డ్ అయితే అక్కడ అందుబాటులో ఉంది' అని సదరు బీసీసీఐ అధికారి ఓ జాతీయ మీడియాకు చెప్పారు.

భారత టెస్టు జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications