ఐపీఎల్ 2024 షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మల్లగుల్లాలు పడుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ బీసీసీఐకి సవాల్‌గా మారింది. ఎన్నికల సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలు స్పష్టం చేయడంతో.. ఈ సీజన్ నిర్వహణపై బోర్డు ఎటు తేల్చుకోలేకపోతుంది.
ఇప్పటికే ఫస్టాఫ్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ మార్చి 22 నుంచి ఏప్రిల్ 9వరకు జరిగే 22 మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా మ్యాచ్‌ల వివరాలను ప్రకటించాలనుకుంది. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు దశల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తామని పేర్కొంది. దాంతో బీసీసీఐకి ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణ తలనొప్పిగా మారింది. జూన్ 1 నుంచే అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కావడంతో..మే చివరి వారానికి ముందే ఐపీఎల్‌ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ గౌతమ్ గంభీర్ ప్రకారం మే 26న ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. టీమ్ చిట్ చాట్‌లో అతను ఫైనల్ డేట్‌ను రివీల్ చేశాడు. అయితే ఏప్రిల్ 19 నుంచి ఎన్నికల జరగనుండటంతో ఆ లోపు కొన్ని మ్యాచ్‌లను షెడ్యూల్ చేసి.. ఎన్నికలు లేని ప్రాంతాల్లో మిగతా మ్యాచ్‌ల నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
భారత్‌లోనే ఐపీఎల్..
కానీ ఎన్నికల ప్రచారాలు, డబ్బుల పంపిణీ అరికట్టడం వంటి పనుల్లో బిజీగా ఉండే పోలీసులు.. మ్యాచ్‌లకు భద్రత కల్పిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత్‌లోనే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని ఓ అధికారి మీడియాకు తెలిపారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆ సీజన్‌ను భారత్‌లో నిర్వహించారు. అప్పుడు మార్చి 23 నుంచి మే 12 వరకు ఐపీఎల్ 2019 సీజన్ జరగ్గా.. ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరిగాయి. ఆ సీజన్ మాదిరే ఈ సారి ఐపీఎల్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో నిర్వహించే పరిస్థితులు లేకుంటే దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహించే ఛాన్స్ ఉంది.
అయితే ఏప్రిల్-మేలో ఎండలు బాగా కొట్టనున్న నేపథ్యంలో దుబాయ్‌లో ఆటగాళ్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో ఐపీఎల్ 2024 షెడ్యూల్‌పై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.