భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బంగారు బాతుగా మారింది. ఇప్పటికే ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ లీగ్స్ తర్వాత అత్యంత విలువైన లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్.. మరోసారి తన బలాన్ని చాటింది. ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా రూ. 5120 కోట్ల లాభాన్ని బీసీసీఐ ఆర్జించింది.
ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వార్షిక ఆదాయంకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఐపీఎల్ 2022 సీజన్‌తో పోలిస్తే ఐపీఎల్ ఆదాయం 116 శాతం పెరిగింది. 2023 సంవత్సరానికి బీసీసీఐ మొత్తం ఆదాయం రూ. 11,769 కోట్లు కాగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 78 శాతం ఎక్కువ. ఖర్చు కూడా 66 శాతం పెరిగి రూ. 6468 కోట్లకు చేరుకుంది.

ఐపీఎల్ మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు బీసీసీఐ ఆదాయాన్ని రెట్టింపు చేశాయి. ఇక, 2023-27 కాలానికి బీసీసీఐ రూ. 48,390 కోట్లతో మీడియా హక్కుల ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్ 2023 సీజన్‌తో ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో డిస్నీ స్టార్ గ్రూప్ రూ. 23,575 కోట్లతో టీవీ రైట్స్ తీసుకోగా, జియో సినిమా రూ. 23,758 కోట్లతో డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. టీవీ, ఓటీటీ రైట్స్ వేర్వేరుగా అమ్మడం బీసీసీఐకి కలిసొచ్చింది.
అలాగే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను టాటా సన్స్ రూ. 2500 కోట్లకు తీసుకోగా.. గతేడాది ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ కూడా బీసీసీఐకి రూ. 377 కోట్ల లాభాన్ని అందించింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించిన బీసీసీఐ.. రిటెన్షన్ పాలసీని రెడీ చేస్తోంది.
ఈనెలాఖరులోగా బీసీసీఐ ఈ విషయంలో స్పష్టతనిచ్చే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. మెగా వేలం రూల్స్ ప్రకారం ప్రతీ జట్టు గరిష్టంగా నాలుగు నుంచి ఐదుగురు ఆటగాళ్లకు రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సంఖ్యను పెంచాలని ఫ్రాంచైజీలు కోరినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపలేమని బీసీసీఐ.. ఐసీసీకి సూచించినట్లు తెలుస్తోంది. తమ మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా 2008 ఆసియా కప్ తర్వాత టీమిండియా.. పాక్‌లో పర్యటించలేదు.