
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పందించింది. పంత్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం పంత్ క్షేమంగా ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని పేర్కొంది. అతని నుదుటిపై రెండు గాట్లు పడ్డాయని, కుడి మొకాలిలో లిగమెంట్ టియర్ వచ్చిందని, కుడి మట్ట, బొటనవేలితో పాటు వీపు భాగంలోగాయాలయ్యానని తెలిపింది. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందని, ఈ విషమ దశ నుంచి అతను కోలుకునేవరకు బోర్డు అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఉత్తరఖాండ్‌లోని రూర్కీ సమీపంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని వెంటనే స్తానికులు సాక్షమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ నుదుటిపై రెండు గాట్లు పడ్డాయి. కుడి మోకాలి లిగమెంట్‌లో టియర్ వచ్చింది. కుడి మట్ట, బొటనవేలితో పాటు వీపు భాగంలో గాయాలయ్యాయి. రిషభ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మ్యాక్స్ ఆసుపత్రిలో అతనికి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ తీయనున్నారు. రిషభ్ పంత్ కుటుంబంతో బీసీసీఐ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. పంత్‌కు చికిత్స అందిస్తున్న మెడికల్ టీమ్‌తోనూ బీసీసీఐ మెడికల్ టీమ్ టచ్‌లో ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి బయటపడేవరకు బీసీసీఐ అతనికి అండగా ఉంటుంది.'అని బీసీసీఐ పేర్కొంది.
ఇక రిషభ్ పంత్ ఓ ఫైటర్ అని, అతను పూర్తిగా కోలుకోని మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ తెలిపాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మొత్తం అతనికి అండగా ఉంటుందని స్పష్టం చేశాడు. బీసీసీఐ సెక్రటరీ జై షా సైతం పంత్ ఫ్యామిలీతో మాట్లాడనని చెప్పాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, అతని చికిత్సను బీసీసీఐ పర్యవేక్షిస్తుందని, కావాల్సిన సపోర్ట్ అందజేస్తుందని ట్వీట్ చేశాడు.
ఇక పంత్ వీపు భాగంలో అయిన గాయాలు కాలినవి కాదని, కారులో నుంచి దూకే క్రమంలో అయిన గాయాలైన వైద్యులు పేర్కొన్నారు. కారులో నుంచి దూకే క్రమంలోనే వీపు, చేతికి గాయాలయ్యాయని స్పష్టం చేశారు. కారులో నుంచి దూకడం వల్లే పంత్ ప్రాణాలతో బయటపడ్డాడని ఉత్తరఖాండ్ పోలీసులు స్పష్టం చేశారు.