భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)-2005 నుంచి బీసీసీఐకి మినహాయింపు ఇచ్చింది. ఇటీవల బీసీసీఐని ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం దేశంలో గుర్తింపు పొందిన ఏ క్రీడా సంఘమైనా ప్రజలకు చెందినదేనని, తమ విధులు, అధికారాలు నిర్వహించే విషయంలో సమాచారా హక్కు చట్టం(ఆర్టీఐ)-2005 పరిధిలోకి అది వస్తుందని అందులో పేర్కొంది. అయితే దీనిపై బీసీసీఐ అభ్యంతరం తెలిపింది.
ఇతర క్రీడా సంఘాల తరహాలో తాము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదని, బోర్డు ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసింది. చివరకు బోర్డు ఆశించిన ప్రకారం వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం కొత్త బిల్లులో సవరణను జోడించింది. సవరించిన బిల్లు ప్రకారం ప్రభుత్వం నుంచి నిధులు, సాయం పొందే క్రీడా సంఘాలు మాత్రమే ఆర్టీఐ పరిధిలోకి వచ్చేలా మార్పులు చేసింది. తాజా సవరణతో ఆర్టీఐ ద్వారా బీసీసీఐని ప్రశ్నించే అధికారం సామన్య ప్రజలకు లేకుండా పోయింది.

'తాజా స్పోర్ట్స్ బిల్లులో బీసీసీఐ అంశం ఒక సమస్యగా కనిపించింది. ఆర్థిక సహకారం తీసుకోవడం లేదనే కారణం చూపించి ఈ బిల్లు ఆమోదం పొందకుండా పార్లమెంట్‌లో అడ్డుకునే అవకాశం ఉండేది. లేదా ఇదే కారణంతో బీసీసీఐ కోర్టుకెక్కేది కూడా. అందుకే సవరణ చేయాల్సి వచ్చింది.'అని కేంద్ర క్రీడా శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఆర్టీఐ నుంచి మినహాయింపు లభించినా.. కొన్ని ఇతర నిబంధనలు బీసీసీఐని ప్రభుత్వం ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టంగా మారితే బీసీసీఐ కూడా వెంటనే జాతీయ క్రీడా సమాఖ్యగా కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్ క్రీడగా మారనుండటం దీనికి ఒక కారణం.
కొత్త బిల్లు ప్రకారం నిధులు పొందకపోయినా.. వ్యవస్థ నడిచేందుకు ఇతర రూపాల్లో సహాయ సహకారాలు తీసుకుంటుంది కాబట్టి జవాబుదారీతనం ఉండాల్సిందే. బీసీసీఐ నేషనల్ స్పోర్ట్స్ ట్రెబ్యునల్ పరిధిలోకి రావడం వల్ల వివాదాలు ఏర్పడితే ఎన్‌ఎస్‌టీ పరిష్కరిస్తుంది. ట్రెబ్యునల్ తీర్పులను సుప్రీం కోర్టులో మాత్రమే సవాల్ చేయాల్సి ఉంటుంది.