కోహ్లీపై ఏ ఆటగాడు ఫిర్యాదు చేయలేదు.. తప్పుకోవాలని మేం ఒత్తిడి చేయలేదు: బీసీసీఐ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం అతని వ్యక్తిగత నిర్ణయమేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. దుబాయ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. పనిభారం తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని అతను వెల్లడించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆర్‌సీబీ కెప్టెన్‌గా తనకు ఇదే చివరి సీజనని, వచ్చే సీజన్ నుంచి ఆటగాడిగానే కొనసాగుతాని ప్రకటించాడు. దాంతో కోహ్లీ నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

మేం ఎందుకు తప్పుకోమంటాం..
కెప్టెన్‌గా కోహ్లీ ప్రవర్తన నచ్చక భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. సీనియర్ ఆటగాళ్ల ఫిర్యాదుపై స్పందించిన బీసీసీఐ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీని ఒత్తిడి చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ గాలివార్తలేనని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. కెప్టెన్సీ విషయంలో కోహ్లీపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నాడు.
కెప్టెన్‌గా అద్భుత విజయాలందించిన విరాట్ కోహ్లీని తామెందుకు తప్పుకోమంటామని అరుణ్ ధుమాల్ ఎదురు ప్రశ్నించాడు. 'కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ కోరలేదు. అది పూర్తిగా అతని నిర్ణయమే. అద్భుత విజయాలందించిన విరాట్ కోహ్లీని మేమేందుకు తప్పుకోమంటాం?'అని ధుమాల్ చెప్పుకొచ్చాడు.

ఎవరిని తక్కువ చేసినట్లు కాదు..
ధోనీని టీమిండియా మెంటార్‌గా నియమించడంపై స్పందిస్తూ.. ఈ నిర్ణయం టీమిండియాకు లాభం చేకూరుస్తుందన్నాడు. ధోనీని మెంటార్‌గా జట్టులోకి తీసుకురావడం అనేది ఎవరినీ తక్కువ చేసినట్లు కాదన్నాడు. 'మహేంద్ర సింగ్ ధోనీ ఓ గొప్ప సారథి. అతని సారథ్యంలోనే భారత్ గొప్ప జట్టుగా ఎదిగింది. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లు గెలిచింది.
అంతేకాకుండా 2010, 2016 ఆసియా కప్‌లతో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. కెప్టెన్‌గా అతని రికార్డులన్నీ గొప్పగా ఉన్నాయి. రాబోయే ప్రపంచకప్‌లో మహీని మెంటార్‌గా కొనసాగించడం భారత జట్టుకు ఎంతో లాభిస్తుంది. జట్టులోనూ ధోనీకి మంచి గౌరవం ఉంది. మాజీ కెప్టెన్‌ను మళ్లీ టీమిండియాలోకి తీసుకురావడం అనేది ఎవరినీ తక్కువ చేసినట్లు కాదు. జట్టులో ఉన్నవారు కూడా అద్భుత సేవలందించారు'అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో..
విరాట్ కోహ్లీ ఇలా వెంటవెంటనే సంచలన నిర్ణయాలను తీసుకోవడానికి ప్రధాన కారణం- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలు కావడమేనని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో నార్తాంప్టస్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న టీమిండియా ఘోరంగా ఓడిపోయింది.
ఈ మ్యాచ్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం వేడెక్కిందని, కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన వ్యూహాలు దారుణంగా తిప్పి కొట్టాయంటూ కొందరు సీనియర్ ఆటగాళ్లు అసహనాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

జై షా రంగంలోకి దిగడంతో..
ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా దృష్టికి తీసుకెళ్లారని, మ్యాచ్‌లో ఓడిపోవడానికి గల కారణాలను వారు పాయింట్ టు పాయింట్ వివరించినట్లు వార్తలొస్తున్నాయి. చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్ బీసీసీఐ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు సీనియర్ క్రికెటర్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న జైషా.. జట్టులోని ఆటగాళ్లందరి అభిప్రాయాలు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీ కెప్టెన్సీ నుంచి ముందుగానే తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications