టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదైంది. క్రికెట్ అకాడమీ నిర్వహణ విషయంలో ధోనీ తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశాడని ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఫిర్యాదు చేశాడు. దాంతో బీసీసీఐ ఎథిక్స్ కమిటీ రూల్ 36 కింద కేసును నమోదు చేసుకొని ఆగస్ట్ 30లోపు వివరణ ఇవ్వాలని ధోనీని ఆదేశించింది.
మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో క్రికెట్ అకాడమీ నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2021లో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఈ ఒప్పందం విషయంలో విబేధాలు తలెత్తాయి. ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బును ఆర్కా సంస్థ చెల్లించలేదని ధోనీ కోర్టును ఆశ్రయించాడు.

దాదాపు రూ. 15 కోట్ల మేర తనకు టోకరా వేశారని, ఆర్కా స్పోర్ట్స్ సంస్థ యజమాని సౌమ్యా దాస్‌పై ధోనీ రాంచీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. ప్రస్తుతం ఆ కేసు విచారాణలో ఉంది. తాజాగా ఆ సంస్థకే చెందిన రాజేశ్ కుమార్ ధోనీనే తమను మోసం చేశాడంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ ఆడుతాడా? లేదా? చర్చ జరుగుతుండగా.. అతనిపై ఛీటింగ్ కేసు నమోదవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీని ఆడించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్ రచించింది. ఐపీఎల్ రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ధోనీని.. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవాలనుకుంటుంది.
ఇందుకోసం ఓ పాత రూల్‌ను మళ్లీ తీసుకురావాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కోరింది. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తయిన ఆటగాళ్లను అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పరిగణించేవాళ్లు. 2008 నుంచి 2021 వరకు ఈ రూల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత తొలగించారు. ధోనీ కోసం ఈ రూల్‌ను మళ్లీ అమలు చేయాలని సీఎస్‌కే డిమాండ్ చేస్తోంది. అయితే ఇతర ఫ్రాంచైజీలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ధోనీ మాత్రం.. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ రిటైన్షన్ రూల్స్ వచ్చిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పాడు.