
న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో తిరిగి దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనుకున్న భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. యువరాజ్ సింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పరిధిలో జరిగే టోర్నీల్లో ఆడేందుకు వీల్లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన యువరాజ్ సింగ్.. ఆ తర్వాత విదేశీ లీగ్‌ల్లో ఆడాడు.
గ్లోబల్ టీ20 కెనడా, టీ10 లీగ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. విదేశీ లీగ్‌ల్లో ఆడిన భారత క్రికెటర్ ఐపీఎల్, దేశవాళీల్లో ఆడేందుకు అనర్హులు. ఈ కారణంగానే యువరాజ్ పునరాగమనానికి బోర్డు అంగీకరించలేదు. యువీతో పాటు గత ఏడాది రిటైర్మెంట్ ఇచ్చిన అంబటి రాయుడు.. నెలల వ్యవధిలోనే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి విదేశీ లీగ్స్‌లో రాయుడు ఆడకపోవడంతో.. బీసీసీఐ అతన్ని మళ్లీ ఆడేందుకు అనుమతించింది. 2020, జనవరిలో ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆడాలని యువరాజ్ సింగ్ ఆశించాడు. ఈ మేరకు పంజాబ్ టీమ్ అతడ్ని సంప్రదించి.. టోర్నీ కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్ జట్టులోనూ చోటిచ్చింది. కానీ.. బీసీసీఐ తాజాగా యువీకి అనుమతి నిరాకరించింది. దాంతో.. ఇక యువీ కేవలం విదేశీ లీగ్స్‌లో మాత్రమే ఆడే అవకాశం ఉంది. యువరాజ్‌లానే ప్రవీణ్ తాంబే కూడా విదేశీ లీగ్ ఆడటంతో అతన్ని ఐపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ అడ్డుకుంది. ఇప్పుడు యువీని ప్రత్యేకంగా భావించి అనుమతిస్తే.. మిగతా ఆటగాళ్లందరూ నిలదీస్తారని, ఇది ఏ మాత్రం భావ్యం కాదని బోర్డు అధికారి ఒకరు అన్నారు.