
న్యూఢిల్లీ: మల్టీ టీమ్ ఈవెంట్స్ మినహా పాకిస్థాన్‌తో ఆడే ముచ్చటే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని క్రికెట్ అభిమానులు భావిస్తుండగా.. బీసీసీఐ మాత్రం దానికి ససేమిరా అంటుంది. పీసీబీతో సహా పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు సైతం భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. భారత్‌తో ఒక్క సిరీస్ ఆడినా.. తమ దరిద్రం పోతుందని, ఆర్థికంగా బలం చేకూరుతుందని పీసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)తో ఓ ప్రతిపాదనను పంపించినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య టెస్ట్ సిరీస్ నిర్వహిస్తామని ఈసీబీ కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన బీసీసీఐ తిరస్కరించిందని, పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసినట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఇక యాషెస్ సిరీస్ కంటే భారత్‌తో ఆడటమే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు ముఖ్యమైందని, భారత్‌తో ఆడటం వల్ల ఆర్థికంగా భారీ ప్రయోజనం చేకూరుతుండటంతో ఈసీబీ.. భారత్-పాక్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దమైందని ది టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది.
ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో 2012-13 తర్వాత నుంచి ఇరు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలన్నిటీని తెంచేసిన భారత ప్రభుత్వం.. క్రీడా సంబంధాల విషయంలోనూ కఠినంగానే వ్యవహరిస్తోంది. దాంతో బీసీసీఐ సైతం రిస్క్ చేయకుండా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఫాలో అవుతుంది. దాంతో ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. దాంతో బీసీసీఐ, ఐసీసీ ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే విధంగా ప్రతీ ఐసీసీ టోర్నీలో ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.
2021 ప్రపంచకప్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆడిన ఇరు జట్లు.. ఈ ఏడాది ఆసియాకప్‌లోనూ తొలి మ్యాచ్‌లోనే తలపడ్డారు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌లోనూ తొలి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు.