
న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుంధర్.. కరోనా వైరస్ బారిన పడ్డాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లేందుకు సిద్దమైన సుంధర్.. ఎన్‌సీఏలోని క్యాంప్‌కు వెళ్లగా నిబంధనల ప్రకారం అతనికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటీవ్ వచ్చింది. దాంతో సుందర్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలోనే అతని స్థానంలో జయంత్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం జయంత్ యాదవ్ సౌతాఫ్రికా పర్యటనలోనే ఉన్నాడు. జడేజా స్థానంలో టెస్ట్ టీమ్‌కు ఎంపికైన అతను తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక రెండో టెస్ట్‌లో తొడ కండరాల గాయానికి గురైన మహమ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా నవ్‌దీప్ సైనీని ఎంపిక చేశారు. ఈ ఇద్దరిని ఎంపిక చేసిన విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా ప్రకటించింది. జనవరి 19న తొలి వన్డే జరగనుండగా.. 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరుగుతుంది.
టీమిండియా రివైజ్డ్ టీమ్ ఇదే:
కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవ్‌దీప్ సైనీ