టీమిండియా జెర్సీ స్పాన్సర్ డ్రీమ్ 11తో ఒప్పందాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రద్దు చేసుకుంది. భారత ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించబోమని బీసీసీఐ సెక్రటరీ దెవాజిత్ సైకియా స్పష్టం చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు రాకతో డ్రీమ్ 11 తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జెర్సీ స్పాన్సర్‌గా కొనసాగలేమని ఇప్పటికే బీసీసీఐ డ్రీమ్ 11 సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2025 ముందే బీసీసీఐ.. డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే పనిలో బీసీసీఐ పడింది. అందుకోసం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది.
టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా మూడేళ్ల కాలానికి బీసీసీఐతో డ్రీమ్ 11 రూ.358 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. కానీ మధ్యలోనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టపరమైన కారణాలతోనే స్పాన్సర్‌షిప్ డీల్‌ను రద్దు చేసుకోవడంతో బీసీసీఐ ఎలాంటి జరిమానా విధించలేదు. ఐపీఎల్‌లో కూడా పలు జట్లకు డ్రీమ్ 11 స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆ ఒప్పందాలను కూడా రద్దు చేసుకోనుంది.

డబ్బులు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమ్స్‌ను పూర్తిగా నిషేధించడం ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రధాన లక్ష్యం. తద్వారా ఆన్‌లైన్ గేమ్స్‌ను వ్యసనంగా మార్చుకోవడాన్ని తగ్గించడం, ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలను నివారించి సమాజాన్ని రక్షించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ కొత్త చట్టం ప్రకారం ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం, ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్, రమ్మీ వంటి అన్ని రకాల ఆటలపై పూర్తి నిషేధం అమలవుతుంది.
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తారు. అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ నడిపేవారికి గరిష్ఠంగా మూడు ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ గురించి ప్రకటనలు చేసేవారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు ఫైన్ వేస్తారు.
కొత్త బిల్లు నేపథ్యంలో డ్రీమ్ 11 కీలక ప్రకటనను విడుదల చేసింది. డబ్బులు చెల్లించి ఆడే పోటీలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉచితంగా ఆడుకునే ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లుగా వాటిని మార్చేశామని తెలిపింది. ఇన్నాళ్లు రూల్స్ ప్రకారమే పనిచేశామని, భారత ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తామని స్పష్టం చేసింది. తమ ఇతర సంస్థలు ఫ్యాన్ కోడ్, డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. డ్రీమ్ 11 మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ అర్థిక సేవల రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందు కోసం డ్రీమ్ మనీ యాప్‌ను తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పసిడి కొనుగోలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలను డ్రీమ్ మనీ యాప్ అందివ్వనుంది.