
న్యూఢిల్లీ: వర్షకాలం తర్వాతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ను నిర్వహించే అవకాశం ఉందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీఈఓ రాహుల్ జోహ్రి తెలిపాడు.
'ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతారు. ఈ లీగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి లీగ్ నిర్వహణపై నిర్ణయంతీసుకుంటాం. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఒక్కరోజులో ఏమీ మారిపోవు. ఓ క్రమపద్ధతిలో టోర్నీ నిర్వహణకి ఉన్న అనువైన మార్గాల్ని అన్వేషిస్తున్నాం. లాక్ డౌన్ ముగిసాక వర్షకాలం మొదలవుతుంది. ఆ తర్వాతే ఐపీఎల్ గురించి ఆలోచించాలి. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం వల్లే కలిగే నష్టం తక్కువే.'అని మీడియాతో మాట్లాడుతూ జోహ్రీ తెలిపాడు.
ఇక మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా కారణంగా ఏప్రిల్ 15కు ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు కనీసం రెండు నెలల విండో కావాలి. ప్రస్తుతం దేశంలో విధించిన లాక్‌డౌన్ మే 31తో ముగియనుంది. ఆ తర్వాత పొడిగిస్తారా లేక ఎత్తేస్తారా? అనే క్లారిటీ లేదు. అయినా జూన్ నుంచే భారత్‌లో వర్షాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండగా.. అవి సెప్టెంబరు వరకూ కొనసాగే అవకాశం ఉంది.
దాంతో అక్టోబరు- నవంబరు మధ్య కాలంలో మాత్రమే ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణకి వీలుంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే తప్ప ఐపీఎల్ నిర్వహణ సాధ్యమయ్యేలా లేదు. ఈ నెల 28న టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.