
న్యూఢిల్లీ: కరోనా గత్తర పుణ్యమా క్రికెట్ టోర్నీలన్నీ ఆగమాగమయ్యాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్స్ అన్నీ గజిబిజీ అయ్యాయి. ఈ మాయరోగంతో సహజీవనం చేయడం తప్ప మరో మార్గం లేకపోవడంతో.. నిబంధనల మధ్యే క్రికెట్ కార్యకలాపాలను మొదలుపెట్టాలని ఆయా బోర్డులు సమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. మరికొద్ది రోజుల్లో పాక్ జట్టు కూడా వెళ్లనుంది.
అయితే ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణపై మాత్రం బీసీసీఐ ఎటు తేల్చుకోలేకపోతుంది. స్టార్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, క్రికెట్ అభిమానులు ఐపీఎల్ జరగాలనే కోరుకుంటున్నారు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదా పడితేనే ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్ నిర్వహించలేమని ఆసీస్ చెబుతున్నా.. ఐసీసీ మాత్రం ఏటు తేల్చక నాన్చుతుంది.
మరోవైపు ప్రపంచకప్ వాయిదా పడితే సెప్టెంబర్-అక్టోబర్ విండోలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు రచించింది. ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వచ్చుడే ఆలస్యం కార్యచరణను మొదలు పెట్టాలనుకుంటుంది. అయితే అదే విండోలో జరగాల్సిన ఆసియాకప్ అడ్డంకిగా మారనుంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సైతం ఐపీఎల్ కోసం ఆసియాకప్‌ను వదులుకోమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులున్న పీసీబీ.. శ్రీలంక లేక యూఏఈ వేదికగా నిర్వహించాలనుకుంటుందని ఆ బోర్డు సీఈవో వసీం ఖాన్ తెలిపాడు. అలాగే కరోనా కారణంగా ఆగిపోయిన పీఎస్ఎల్ మ్యాచ్‌లను నవంబర్‌లో నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా తెలిపాడు. ఇదంతా బీసీసీఐకి తలనొప్పి కానుంది.
అయితే పీసీబీ ఆసియాకప్ నిర్వహించాలనుకుంటే మాత్రం పీఎస్‌ఎల్ వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలని బీసీసీఐ సూచిస్తుంది. అలా చేస్తేనే నవంబర్‌లో ఆసియాకప్ నిర్వహించవచ్చని అభిప్రాయపడింది.'ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఆసియాకప్ జరగడం కష్టమే. పీసీబీ చెప్పిన షెడ్యూల్ భారత్‌కు సెట్ కాదు. పీఎస్‌ఎల్‌ను వాయిదా వేస్తే మాత్రం ఆ విండోలో నిర్వహించవచ్చు. అలా కాకుండా ఆసియాకప్ జరగాలంటే మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లో కుదరని పని.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందనేది చెప్పలేమని, స్పష్టత వస్తేనే తాము దానికి అనుగుణంగా ప్రణాళికలు రచిస్తామని సదరు అధికారి వెల్లడించాడు. అప్పటి వరకు సెప్టెంబర్-అక్టోబర్ విండో ఆసియాకప్‌కే ఉంటుందన్నాడు.