
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అభిమానులకు శుభావార్త. అందరూ ఊహించినట్లే క్యాష్ రిచ్ లీగ్‌లో మరో రెండు జట్లను చేర్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాకాపోతే ఈ నిర్ణయాన్ని 2022 సీజన్ నుంచి అమలు చేయనుంది.
2021 సీజన్ నుంచే 10 జట్లతో ఐపీఎల్ జరపాలని కొందరు సభ్యులు ప్రతిపాదించినా, ఇప్పుడంత సమయం లేదని, రెండు కొత్త జట్లకు బిడ్డింగ్ లు పిలవాల్సి ఉండడంతో నూతన ఫ్రాంచైజీలను హడావిడిగా నిర్ణయించలేమని బోర్డు యాజమాన్యం పేర్కొంది.
ఈ ఏజీఎం సమావేశంలోనే ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను రాజీవ్ శుక్లా అధికారికంగా స్వీకరించారు. అలాగే భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న రెండు ఐసీసీ టోర్నీలు 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్ కప్ నిర్వహణపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా ఈ మెగాటోర్నీల నిర్వహణ విషయంలో పన్ను మినహాయింపు లభించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలనే కీలక నిర్ణయం తీసుకున్నామని ఈ మీటింగ్‌కు హాజరైన ఓ బోర్డు మెంబర్ మీడియాకు తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే బోర్డు సెక్రటరీ, ట్రెజరర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారని చెప్పారు.
'2021 టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీల విషయంలో పన్ను మినహాయింపు లభించే అవకాశాలపై సెక్రటరీ జైషా, ట్రెజరర్ అరుణ్ ధూమల్ త్వరలోనే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ఒకవేళ పన్ను మినహాయింపుకు ప్రభుత్వం అంగీకరించకపోతే.. దానికి తగ్గట్లు ప్రణాళికలు రచిస్తాం. ఇప్పటికే 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీ పన్ను మినహాయింపు వ్యవహారం పెండింగ్‌లో ఉంది.'అని సదరు సభ్యుడు ఏఎన్‌ఐతో అన్నారు.
ఇక, 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలన్న ఐసీసీ నిర్ణయానికి సూత్రప్రాయంగా మద్దతు పలకాలని నేటి సమావేశంలో నిర్ణయించారు. ముందుగా, ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశం విధివిధానాలపై ఐసీసీ నుంచి తగిన స్పష్టత కోరాలని భావిస్తున్నారు.