టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలను గౌతమ్ గంభీర్ స్వీకరించే అవకాశం ఉందని నేషనల్ మీడియా కోడై కూస్తోంది.
ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆసక్తి కలిగినవారు మే 27, సాయంత్ర 6 గంటల లోపు ద దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సెక్రటరీ జై షా పేరిట ఓ ప్రకటనను విడుదల చేసారు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవి కాలం అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది.

దాంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్తగా ఎంపికయ్యే హెడ్ కోచ్.. పదవి కాలం మూడున్నరేళ్లు ఉంటుందని, 2027 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారని పేర్కొంది. కొత్తగా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలని, పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ తమ ప్రకటనలో ప్రస్తావించింది.
గంభీర్‌ను అప్రోచ్ అయిన బీసీసీఐ..
టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో విదేశీ కోచ్‌లతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా కొనసాగుతున్న తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా గౌతమ్ గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ పెద్దలు అప్రోచ్ అయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ముఖ్యంగా బీసీసీఐ సెక్రటరీ జై షా.. గౌతమ్ గంభీర్‌ను హెడ్ కోచ్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేకేఆర్ మెంటార్‌గా గౌతమ్ గంభీర్ అద్భుత ఫలితాలు రాబట్టాడు. గత రెండు సీజన్లలో దారుణంగా విఫలమైన కేకేఆర్‌ను అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ చేర్చాడు. సునీల్ నరైన్‌ను మళ్లీ ఓపెనర్‌గా ఆడించడం, ఆండ్రూ రస్సెల్ మునపటిలా సత్తా చాటడం.. హర్షిత్ రాణా వంటి యువ బౌలర్ కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించడం వెనుక గంభీర్ ఉన్నాడు.
కేకేఆర్‌పై గంభీర్ మార్క్
మ్యాచ్ సందర్భంగా అతను తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే వ్యూహాలు కూడా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. క్రికెట్‌పై మంచి పట్టున్న గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా నియమిస్తే మంచి ఫలితాలు ఉంటాయని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ లేదా గౌతమ్ గంభీర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన తర్వాత ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరో వైపు టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్ చేయడంతోనే లోక్‌సభ ఎన్నికల నుంచి గంభీర్ తప్పుకున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజకీయంగా తీసుకున్న నిర్ణయమనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.