
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020-2021 సీజన్‌కుగాను మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాను బుధవారం ప్రకటించింది. గతేడాది కాంట్రాక్ట్‌లలో 22 మంది ఉండగా... ఈసారి దానిని 19 మందికి పరిమితం చేసింది. వార్షిక కాంట్రాక్ట్ ఫీజుల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. గ్రేడ్ 'ఎ'లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు... గ్రేడ్ 'బి' వారికి రూ. 30 లక్షలు... గ్రేడ్ 'సి' వారికి రూ. 10 లక్షలు లభిస్తాయి.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించిన షెఫాలీ వర్మకు ప్రమోషన్ లభించింది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టెస్ట్, వన్డే టీమ్‌లకు కూడా ఎంపికైన షెఫాలీని సి నుంచి బి గ్రేడ్‌లో తీసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్ గ్రేడ్-ఎ కాంట్రాక్టులు రిటైన్ చేసుకున్నారు. గ్రేడ్-బిలో గతేడాది ఎనిమిది మంది ఉండగా.. ఈసారి మరో ఇద్దరిని చేర్చారు. అయితే, 11 మందితో కూడిన గ్రేడ్-సిని బోర్డు ఆరుగురికి తగ్గించింది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, దీప్తి శర్మ తమ గ్రేడ్-బి కాంట్రాక్టులను నిలబెట్టుకున్నారు.
షెఫాలీతో పాటు పూనమ్ రౌత్, రాజేశ్వరి, సీ నుంచి బీ గ్రేడ్‌కు ప్రమోట్ అయ్యారు. హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి, హార్లీన్ డియోల్ గ్రేడ్-సి కాంట్రాక్టులు నిలబెట్టుకున్నారు. గత ఏడాది కాంట్రాక్ట్ పొందిన ఏక్తా బిష్త్, వేద కృష్ణమూర్తి, హేమలత, అనూజా పాటిల్‌లకు ఈసారి స్థానం లభించలేదు. బెంగాల్ అమ్మాయి రిచా ఘోష్‌కు తొలిసారి కాంట్రాక్ట్ దక్కింది. పురుష క్రికెటర్ల కాంట్రాక్టులతో ఇవి ఏమాత్రం సరితూగవు. మెన్స్ టీమ్ సి-గ్రేడ్ ఆటగాళ్లకే రూ. కోటి వార్షిక వేతనం అందనుండగా.. మహిళ క్రికెటర్లలో ఏ గ్రేడ్ వారికి రూ.50 లక్షలే.
గ్రేడ్ 'ఎ' (రూ. 50 లక్షలు ): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్.
గ్రేడ్ 'బి' (రూ. 30 లక్షలు ): మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేశ్వరి గైక్వాడ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా, జెమీమా రోడ్రిగ్స్.
గ్రేడ్ 'సి' (రూ. 10 లక్షలు ): అరుంధతి రెడ్డి, మాన్సి జోషి, పూజా వస్త్రకర్, హర్లీన్ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్.