IPL 2021 Auction: 292 మందితో షార్ట్ లిస్ట్.. సచిన్ తనయుడికి చాన్స్.. శ్రీశాంత్‌కు దక్కని చోటు!

చెన్నై: ఐపీఎల్-2021 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. ఈ నెల 18న చెన్నైలో జరిగే వేలంలో
పాల్గొనేందుకు 1,114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ జాబితాలో వెటరన్ పేసర్ శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. ఇటీవలే నిషేధం పూర్తి చేసుకొని దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్.. ఐపీఎల్ ఆడాలని భావించాడు. కానీ ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చకపోవడంతో అతను షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మాత్రం అవకాశం దక్కింది.

ఆర్‌సీబీలోనే..
వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 11 స్థానాలు ఖాళీ ఉండగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్ నుంచి హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, విదేశాల నుంచి.. స్మిత్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. ఇక ఈ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌ను ఎవరు కొనుగోలు చేస్తారనేదే ఆసక్తిగా మారింది. అతను కనీస ధర రూ.20 లక్షలతో వేలంలో అందుబాటులో ఉన్నాడు.

మారింది ముగ్గురే..
ఐపీఎల్ 2021 ప్లేయర్స్ ట్రేడింగ్‌కు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. గురువారంతో ముగిసిన ట్రేడింగ్ విండోలో కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఈ అవకాశం ద్వారా వేరే ఫ్రాంచైజీలకు మారారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆల్‌రౌండర్లు డానియల్ సామ్స్, హర్షల్ టేల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసింది. ఈ రెండు పూర్తిగా క్యాష్ డీల్స్ కావడం విశేషం. వీటి తర్వాత ట్రేడ్ ఆఫ్షన్‌ను మరే ఫ్రాంచైజీలు ఉపయోగించుకోలేదు. గత సీజన్‌లో 11 మంది ప్లేయర్లు ట్రేడ్ విండో ద్వారా ఫ్రాంచైజీలు మారారు.

టైటిల్ స్పాన్సర్ వివోనే..
చైనీస్ మొబైల్ కంపెనీ వివో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో ఉన్న బంధాన్ని తెంచుకునేందుకు సిద్దమవుతోందని ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ ప్రకటనలో మాత్రం 'వివో' ఐపీఎల్-2021 అని ప్రముఖంగా ప్రస్తావించి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది లీగ్‌కు మళ్లీ చైనా మొబైల్ కంపెనీ 'వివో'నే స్పాన్సర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కింద సీజన్‌కు రూ.440 కోట్లు చెల్లించే విధంగా వివో ఐదేళ్లు(2022 వరకు) కాంట్రాక్టు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.
దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌కు డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇందుకోసం డ్రీమ్ 11 బోర్డుకు రూ.222 కోట్లు చెల్లించింది. మరోపక్క ఇరుదేశాల మధ్య ఇప్పటికీ అదే పరిస్థితులు ఉండడంలో లీగ్‌తో కొనసాగడం సరికాదని వివో భావిస్తోందని, హక్కులను బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరిగింది. ఈ మేరకు డ్రీమ్ 11, అన్ అకాడమీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిసింది.

ఏప్రిల్‌లో ఐపీఎల్ 2021
కరోనా కారణంగా గతేడాది యూఏఈకి తరలిన ఐపీఎల్.. ఈ సారి మాత్రం భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ సీజన్ షెడ్యూల్‌పై బోర్డు కసరత్తులు ప్రారంభించింది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ జరగనుందని తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు మార్చి 28న ముగుస్తాయి. ఈ సిరీస్‌లు ముగిసిన 13 రోజుల తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌ను ప్రారంభించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 11న తొలి మ్యాచ్, జూన్ 6న ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాతే ఐపీఎల్ 2021 షెడ్యూల్ అధికారికంగా విడుదలకానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications