
ముంబై: ఆసియా కప్ 2022 టోర్నీ బరిలోకి దిగే టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తాత్కలిక కోచ్‌ను ఎంపిక చేసింది. రెగ్యూలర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడటంతో తాత్కలిక కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.
రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకొని జట్టుతో కలిసే వరకు వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ కోచ్‌గా కొనసాగుతాడని పేర్కొంది. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రాహుల్ సేన 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ పర్యటనలో ఆడి ఆసియాకప్‌కు ఎంపికైన కేఎల్ రాహుల్, దీపక్ హుడా, దీపక్ చాహర్, అక్షర్ పటేల్‌లతో కలిసి వీవీఎస్ లక్ష్మణ్ దుబాయ్‌కి చేరుకున్నాడు.
కరోనా బారిన పడటంతో ద్రవిడ్ దుబాయ్ విమానం ఎక్కలేదు. 'అక్కడికి బయల్దేరే ముందు రొటీన్‌గా చేసే కోవిడ్ పరీక్షల్లో ద్రవిడ్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయనకు అతి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. దీంతో ఆయన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్టు రాగానే ద్రవిడ్ యూఏఈకి పయనమవుతారు' అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు.
ఆసియా కప్‌కు ఎంపికైన రోహిత్ శర్మ బృందంలో ముగ్గురు మినహా మెజారిటీ సభ్యులంతా మంగళవారం ఉదయం దుబాయ్‌లో అడుగుపెట్టారు. జింబాబ్వే పర్యటను వెళ్లిన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, రిజర్వ్ ప్లేయర్ అక్షర్ పటేల్‌లు హరారే నుంచి దుబాయ్‌కి చేరుకున్నారు. ఆసియా కప్ ప్రధాన టోర్నీ యూఏఈలో ఈనెల 27 నుంచి జరుగుతుంది. 28న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది.