
న్యూఢిల్లీ: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన్ శర్మ నేతృత్వంలో ఆలిండియా సెలెక్షన్ కమిటీ మంగళవారం వెళ్లడించింది. ఇక అంతా ఊహించనట్లుగానే టీ20 సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ తొలిసారి టీమిండియా నుంచి పిలుపు అందుకోగా.. రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాపై వేటు పడింది. దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఈ సిరీస్ నుంచే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
భారత్, కివీస్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్‌కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి.అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్‌లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది.
న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్
ఈ జట్టుతో పాటే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్‌ల (నాలుగు రోజుల మ్యాచ్‌లు) సిరీస్ కోసం 14 మంది సభ్యులను ఎంపికచేసింది. ఈ జట్టుకు సారధిగా ప్రియాంక్ పంచల్‌ను ఎంపిక చేసిన భారత సెలెక్షన్ కమిటీ.. సీనియర్లు రాహుల్ చాహర్, నవ్‌దీప్ సైనీలకు చోటు కల్పించింది.
భారత-ఏ జట్టు: ప్రియాంక్ పంచల్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్(వికెట్‌కీపర్), కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, సౌరభ్ కుమార్, నవ్‌దీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పోరెల్, అర్జాన్ నగవస్వల్లా