
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ బేషరతు క్షమాపణను బీసీసీఐ అంగీకరించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లోని ఫ్రాంచైజీ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు దినేశ్‌కు బీసీసీఐ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుకు సమాధానంగా దినేశ్ కార్తీక్ బీసీసీఐకి బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ అభ్యర్థన మేరకే విండీస్‌కి వెళ్లానని, మ్యాచ్‌ను వీక్షించాలని అతను కోరడంతో డ్రెస్సింగ్ రూంలో కూర్చున్నానని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు.
"బీసీసీఐ అనుమతి లేకుండా సీపీఎల్‌కి వెళ్లడం పొరపాటే. అందుకు బేషరుతుగా క్షమాపణలు కోరుతున్నా. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టుకి సంబంధించి ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోను. ఇకపై వారి డ్రెస్సింగ్ రూంకి వెళ్లి మ్యాచ్‌లు చూడను" అని లేఖలో కార్తీక్ పేర్కొన్నాడు.
దీంతో దినేష్ కార్తీక్ క్షమాపణను బీసీసీఐ అంగీకరించిందని, ఈ విషయం ఇప్పుడు ముగిసినపోయిన అధ్యాయమని పీటీఐతో బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ట్రిన్‌బాగో జట్టు షారుక్ ఖాన్‌ది కావడం.. అతని యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా వ్వవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇండియా తరుపున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడిన దినేశ్ కార్తీక్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జెర్సీని ధరించి బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించాడు. ఐపీఎల్‌లో షారుఖ్ ఖాన్ సహా యజమానిగా ఫ్రాంచైజ్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న కార్తీక్ విండిస్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి బీసీసీఐ నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా హాజరయ్యాడు.