
సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ బౌలర్ ఒక్క బంతికే 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిడ్నీ సిక్సర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా రెండో ఓవర్‌ను వేసిన ఆస్ట్రేలియా పేసర్ జోయెల్ పారిస్ ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను ఎదుర్కొన్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. మూడో బంతికి మాత్రం స్మిత్ సిక్సర్ బాదాడు. అయితే ఆ బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఫ్రీ హిట్ లభించగా.. అదీ కాస్త వైడ్‌గా వెళ్లి బౌండరీని తాకడంతో మొత్తం ఐదు పరుగులొచ్చాయి. తర్వాత ఫ్రీ హిట్‌ను స్మిత్ బౌండరీకి పంపాడు. దీంతో జోయెల్ పారిస్ ఒక బంతికి 16 పరుగులు సమర్పించుకున్నట్లయింది. 6నోబాల్, 4వైడ్, 4లతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఈ చెత్త రికార్డుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. హోబర్ట్ హరికేన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 156 పరుగులే చేసింది. దీంతో సిడ్నీ సిక్సర్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 33 బంతుల్లోనే 66 పరుగులు చేసిన స్మిత్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్(33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన హరికేన్స్.. తమ కోటా ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే(49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిక్సర్స్ బౌలర్లలో జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, హేడెన్ కేర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నవీద్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. వరుసగా రెండు సెంచరీలు బాదాడు.