
హోబర్ట్: క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరగని విచిత్ర ఘటన బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. బ్యాట్స్‌మన్ అతి తెలివికి అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. రెండో పరుగు తీసే క్రమంలో ఔటవుతానేమోననే భయంలో అతి తెలివి కనబర్చిన సదరు బ్యాట్స్‌మన్ క్రీజు మధ్యలో నుంచే వెనక్కి తిరిగాడు. ఉద్దేశపూర్వకంగానే షార్ట్ రన్ తీయడంతో అంపైర్లు 5 పరుగుల కోత విధించారు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరుగుతున్న లీగ్ ఈ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హోబర్ట్ హరికేన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బంతిని బ్రాడీ కౌచ్ యార్కర్‌గా సంధించగా.. టిమ్ డేవిడ్ లాంగాన్ దిశగా ఆడి క్విక్ డబుల్‌కు ప్రయత్నించాడు. అయితే తొలి రన్‌ను పూర్తి చేసుకున్న అతను.. ఫీల్డర్ బంతి వేయడాన్ని గమనించి రెండో పరుగు పూర్తి చేయకుండా మధ్యలోనే వెనక్కి వచ్చాడు.
దాంతో అంపైర్లు దాన్ని షార్ట్ రన్‌గా ప్రకటించారు. ఇక టీవీ రిప్లేలో డేవిడ్ ఉద్దేశపూర్వకంగానే షార్ట్ రన్ తీసాడని తేలడంతో ఐదు పరుగుల కోత విధించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. 'నీదే తెలివి అనుకున్నావా? డేవిడ్ మామ'అంటూ కామెంట్ చేస్తున్నారు. 'ఔటైనా అయిపోవ్.. నీ వల్ల 5 పరుగులు బొక్కా'అని సెటైర్లు పేల్చుతున్నారు.
ఆ తర్వాత 6 పరుగులు మాత్రమే రావడంతో హోబర్ట్ హారికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ బెన్ మెక్‌డెర్మోట్(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ మాథ్యూ వేడ్(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), డీఆర్సీ షార్ట్ (24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) పర్వాలేదనిపించారు. ఇక అతి తెలివి ప్రదర్శించిన టిమ్ డేవిడ్(12 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 22 నాటౌట్) విలువైన పరుగులు జోడించాడు. ఆండ్రీ రస్సెల్ మూడు వికెట్లతో చెలరేగగా.. నాథన్ కౌల్టర్ నైల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్ స్టార్స్ 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 79 రన్స్ చేసింది. క్రీజులో జో క్లార్క్(41 బ్యాటింగ్), జో బర్న్స్ (5 బ్యాటింగ్) ఉన్నారు.