
సిడ్నీ: టీ20 క్రికెట్‌లో మరో మెరుపు ఫీల్డింగ్ అభిమానులను కనువిందు చేసింది. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా గురువారం రాత్రి సిడ్నీ సిక్సర్స్, హోబార్ట్ హరీకేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జోర్డాన్ సిల్క్ సూపర్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఇటీవల ముగిసిన భారత్-ఆస్ట్రేలియా ఆఖరి టీ20లో సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. గ్లేన్ మ్యాక్స్ వెల్ కొట్టిన భారీ సిక్సర్‌ను సంజూశాంసన్ అడ్డుకోగా.. విరాట్ కోహ్లీ బాదిన షాట్‌ను స్మిత్ అడ్డుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద రెప్పపాటు క్షణంలో గాల్లోకి ఎగిరి ఈ ఇద్దరు బంతిని అడ్డుకున్న తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది.
అయితే, అచ్చం అలాంటి మెరుపు ఫీల్డింగ్ విన్యాసమే ఇప్పుడు మరోసారి బిగ్‌బాష్ లీగ్‌లో చోటుచేసుకుంది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సిడ్నీ 12 ఓవర్లకు హరీకేన్స్‌ను 76/4కే కట్టడి చేసింది. ఆపై టిమ్ డేవిడ్(58), కొలిన్ ఇన్‌గ్రామ్(55) అర్ధశతకాలతో రెచ్చిపోవడంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 178/8 స్కోర్ సాధించింది.
అయితే, స్టీవ్ ఒకేఫె వేసిన 15వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదిన టిమ్ నాలుగో బంతికి సింగిల్ తీశాడు. అనంతరం కొలిన్ ఐదో బంతికి మరో బౌండరీ బాదగా చివరి బంతిని కూడా దాదాపు సిక్సర్‌గా మలిచాడు. బంతి బౌండరీ దాటి నేలకు తాకుతున్న సమయంలో అమాంతం గాల్లోకి డైవ్‌చేసిన జోర్డాన్ దాన్ని ఒంటిచేత్తో అందుకొని తిరిగి మైదానంలోకి విసిరాడు. దాంతో సిడ్నీ టీమ్‌కు నాలుగు పరుగులు సేవ్ చేశాడు.
ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు జోర్డాన్ ఫీల్డింగ్‌ను మెచ్చుకున్నారు. నెటిజన్లు సైతం అతని విన్యాసం చూసి ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఛేదనకు దిగిన సిడ్నీ 20 ఓవర్లలో 162/6కే పరిమితమైంది. 16 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మరోవైపు ఫీల్డింగ్‌లో అదిరిపోయే విన్యాసం చేసిన జోర్డాన్ బ్యాటింగ్‌లో తేలిపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు.