ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. వరుసగా 4 విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. సూపర్-8లో భాగంగా గత వరల్డ్ కప్ ఫైనలిస్ట్ సౌతాఫ్రికాతో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దాంతో గత టోర్నీ మెగా ఫైనల్ రిపీట్ కానుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ టోర్నీలో భారత్‌తో పాటు సౌతాఫ్రికా కూడా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా లీగ్ దశను ముగించింది. అఫ్గానిస్థాన్‌తో డబుల్ సూపర్ ఓవర్‌లో గట్టెక్కింది. టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ జట్లుగా నిలుస్తున్న ఈ రెండు టీమ్స్‌కు బలమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల బలంగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది మోర్కెల్ అన్నదమ్ముల సవాల్.
ఇరు జట్ల డగౌట్లలోనూ మోర్నే మోర్కెల్, అల్బీ మోర్కెల్ ప్రత్యర్థులుగా నిలవడం విశేషం. భారత్, సౌతాఫ్రికా జట్ల కోసం వారు వ్యూహాలు పన్ననున్నారు. భారత్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న మోర్నే మోర్కెల్ (41), హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో కీలక సభ్యుడు. సొంత జట్టు సౌతాఫ్రికా బ్యాటింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నాడు. సౌతాఫ్రికా తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లలో మొత్తం 544 వికెట్లు పడగొట్టిన ఆయనకు ప్రత్యర్థి బ్యాటర్ల బలాలు, బలహీనతలపై మంచి పట్టు ఉంది.

మరోవైపు, మోర్నే మోర్కెల్ అన్న అల్బీ మోర్కెల్ (44) సౌతాఫ్రికా జట్టుకు స్పెషలిస్ట్ కన్సల్టెంట్‌గా ఉన్నాడు. అతను సౌతాఫ్రికా తరఫున 1 టెస్ట్, 58 వన్డేలు, 50 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 1,412 పరుగులు చేసి 77 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అనుభవం, భారత పరిస్థితులు, టీ20 వ్యూహాలపై అల్బీకి మంచి పట్టును కల్పించింది.
ఈ మ్యాచ్‌పై అల్బీ మోర్కెల్ సరదాగా స్పందించాడు. 'మా అమ్మను ఈ మ్యాచ్ చాలా ఇబ్బంది పెడుతోంది. మా ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో ఆమెకు అర్థం కావట్లేదు’ అని చమత్కరించాడు. రక్త సంబంధం ఒకవైపు, వృత్తిపరమైన పోటీ మరోవైపు నిలవగా, ఈ 'మోర్కెల్ ఫ్యాక్టర్' సూపర్-8 పోరులో తొలి పాయింట్లు ఏ జట్టుకు దక్కుతాయో అనేది ఆసక్తికరంగా మారింది.