న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కంటే ఆస్ట్రేలియాతో తలపడే టీమిండియా మ్యాచే రసవత్తరంగా ఉంటుందని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఘాటుగా స్పందించాడు. మెగా టోర్నీకి ముందు దాదా మైడ్ గేమ్ ఆడుతున్నాడని తెలిపాడు.
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న హైప్ మరే మ్యాచ్‌కు రాదని, ఇరు దేశాల్లో ఈ మ్యాచ్ జరిగేటప్పుడు రోడ్లన్నీ ఖాళీగా మారుతాయని తెలిపాడు. ప్రతీ ఒక్కరు టీవీలకు అతుక్కుపోతారని ఈ పాక్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. 2017 వరకు ప్రపంచకప్‌ల్లో భారత ఏక పక్షంగా గెలిచినా.. తర్వాత పరిస్థితులు మారాయని గుర్తు చేశాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో కూడా విరాట్ కోహ్లీ ఒక్కడి వల్లే గెలిచారని తెలిపాడు.

'భారత్-పాక్ మ్యాచ్‌ను ఉద్దేశించి సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు నన్ను షాక్‌కు గురి చేశాయి. సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్. టాప్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఎంతో మంది ప్రతిభావంతులను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. భారత్-పాక్ మ్యాచ్‌లన్నీ వన్‌సైడెడ్ అయ్యాయని దాదా చేసిన వ్యాఖ్యలను నేను అంగీకరించను.
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్థాన్‌ను టీమిండియా చాలాసార్లు ఓడించింది. అయితే 2017 తర్వాత పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ .. భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఆసియా కప్ టోర్నీలోనూ ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. మేం ఫైనల్ కూడా వెళ్లాం.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్2022లో టీమిండియా చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే అది కేవలం విరాట్ కోహ్లీ వల్లే దక్కిన విజయం. అతనే ఒంటిచేత్తో పాకిస్థాన్‌ను ఓడించాడు. ఆ రోజు అతను ఆడింది చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్. పాక్‌తో కంటే ఆసీస్ మ్యాచ్‌కే హైప్ ఎక్కువగా ఉంటుందని దాదా చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదు.
భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల్లో రోడ్లన్నీఖాళీగా ఉంటాయి. టికెట్లు, హోటల్స్ రేట్లు నాలుగింతలు పెరుగుతాయి. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఈ పరిస్థితులు ఉంటాయా? దాదా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. తన వ్యాఖ్యలతో పాక్ టీమ్‌పై ఒత్తిడి పెంచాలనుకుంటున్నాడు.'అని బాసిత్ అలీ చెప్పుకొచ్చాడు.