చెన్నై: టాపార్డర్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ నజ్ముల్ షాంటో తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం వైస్ కెప్టెన్సీ హోదాలో మాట్లాడిన నజ్ముల్ షాంటో.. పేలవ బ్యాటింగే ఓటమికి కారణమైందన్నాడు.
గాయపడిన తమ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపాడు.'షకీబ్ అల్ హసన్ స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. ఆ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాతే అతని గాయం తీవ్రతపై స్పష్టత రానుంది. ఈ మ్యాచ్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. గత మ్యాచ్ మాదిరే తొలి 15 ఓవర్లలో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం.

కొత్త బంతితో బౌన్స్ లభించింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్‌కు సులువైంది. మా టాపార్డర్ బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌కు ఇది అనుకూలమైన వికెట్. ఆరంభంలో మేం కాస్త బాధ్యతగా బ్యాటింగ్ చేయాల్సింది. గత మ్యాచ్‌లో మేం సరిగ్గా బౌలింగ్ చేయలేదు. కానీ ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు రాణించారు.
ముఖ్యంగా మా పేసర్లు సత్తా చాటారు. రాబోయే మ్యాచ్‌ల్లో మేం మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి'అని షాంటో చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహామ్(74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), టెయిలెండర్ మహ్మదుల్లా(49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్(3/49) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్డ్(2/36), మ్యాట్ హెన్రీ(2/56) రెండేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్‌కు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 42.5 ఓవర్లలో 2 వికెట్లకు 248 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. డారిల్ మిచెల్(67 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(107 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 78) క్లాస్ బ్యాటింగ్ చేశాడు.
డెవాన్ కాన్వే(59 బంతుల్లో 3 ఫోర్లతో 45) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.