బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ 2026 సీజన్ ఆడకుండా నిషేధం విధించడంపై బంగ్లా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని భారత్ వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమైంది.
ఈ క్రమంలోనే ముస్తాఫిజర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)ను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న కేకేఆర్.. బీసీసీఐ ఆదేశాలతో అతన్ని వదిలేసింది.

ఈ చర్యను తప్పుబట్టిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. తాజాగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. 'ఈ ఏడాది మార్చిలో జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించాలని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటో తెలియదు. కానీ ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను బాధించింది. ఈ పరిస్థితుల్లో.. తదుపరి నోటీసు వచ్చేవరకు ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలి.'అని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ ఆదేశాల్లో పేర్కొంది.
వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. తమ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) విజ్ఞప్తి చేసింది. బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఆ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించే అవకాశం ఉంది. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ముస్తాఫిజుర్ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. రాజకీయ ఒత్తిళ్లకు బీసీసీఐ తలొగ్గడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ క్రికెటర్‌పై నిషేధం విధించినప్పుడు.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఆ దేశానికి ఎందుకు పంపడం లేదని నిలదీసారు.