విశ్వవిజేత ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్... టీ20 సిరీస్ క్లీన్ స్వీప్!

మిర్పూర్: వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన నామమాత్రపు మూడో టీ20లో 16 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది.
ఓపెనర్ లిటన్ దాస్(57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 73) హాఫ్ సెంచరీతో రాణించగా.. నజ్ముల్ హొస్సెన్ షాంటో(36 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 47 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
డేవిడ్ మలాన్ రాణించినా..?
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. డేవిడ్ మలాన్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ జోస్ బట్లర్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 40) విజయం కోసం పోరాడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.
మలుపు తిప్పిన ముస్తాఫిజుర్..
లక్ష్యచేధనలో 14వ ఓవర్ల వరకు పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదేలు అయ్యింది. 13వ ఓవర్ ప్రారంభానికి ముందు 100/1తో ఉన్న ఇంగ్లండ్ స్కోరు.. 17 ఓవర్లు ముగిసేటప్పటికీ 123-5గా మారింది. ముస్తాఫిజుర్ వేసిన 14వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ ఓవర్ తొలి బంతికి డేవిడ్ మలన్ ఔటవ్వగా.. రెండో బంతికి జోస్ బట్లర్.. మెహది హసన్ సూపర్ ఫీల్డింగ్‌తో రనౌట్ అయ్యాడు.
కట్టుదిట్టంగా బౌలింగ్..
ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ(9), సామ్ కరన్(4) వరుసగా పెవిలియన్ చేరారు. చివరి 3 ఓవర్లలో ఇంగ్లండ్ విజయానికి 36 పరుగులు చేయాల్సి రాగా.. ముస్తాఫిజుర్, షకీబ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 9 పరుగులే వచ్చాయి. దాంతో చివరి ఓవర్లో 27 పరుగులే అవసరమవ్వగా.. ఇంగ్లండ్ 10 పరుగులే చేసి ఓటమిపాలైంది.
ఏ బిడ్డా ఇది నా అడ్డా..
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ను బంగ్లాదేశ్ ఓడించడంతో అభిమానులు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ బంగ్లా ఆటగాళ్లు చెలరేగారు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను ఓడించడం అంత సులువైన పనికాదు. ఇంగ్లండ్‌తో పాటు ఆసీస్, భారత్, సౌతాఫ్రికా టీమ్స్ కూడా బంగ్లా గడ్డపై ఓటమిపాలయ్యాయి. ఈ సిరీస్‌కు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో ఇంగ్లండ్‌కు కోల్పోయిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి బదులు తీర్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications