బంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టుకు అప్పనంగా ఒక్క బంతికే 10 పరుగులు లభించాయి. కనీసం బ్యాట్ టచ్ చేయకుండానే బంగ్లాదేశ్ ఖాతాలో ఈ పరుగులు చేరడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 144.2 ఓవర్లలో 6 వికెట్లకు 575 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. టోనీ డీ జోర్జీ(269 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 177), ట్రిస్టన్ స్టబ్స్(198 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106), వియాన్ మల్డర్(150 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105 నాటౌట్) శతకాలతో రాణించగా.. సేనురన్ ముతుసామీ(175 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), డేవిడ్ బెడింగ్‌హమ్(78 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్(5/198) ఐదు వికెట్లు తీయగా.. నహిద్ రాణా(1/83) ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు తొలి బంతికే 10 పరుగులు ఖాతాలో చేరాయి. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ సేనురన్ ముతుసామీ పదే పదే మిడిల్ పిచ్‌పై పరుగెత్తి అంపైర్ల మందలింపుకు గురయ్యాడు.
అంపైర్ పెనాల్టీ..
పలుమార్లు హెచ్చరించినా తన తీరును మార్చుకోలేదు. దాంతో అంపైర్లు నిబంధన ప్రకారం సౌతాఫ్రికాకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. దాంతో బంగ్లాదేశ్ ఖాతాలో అప్పనంగా 5 పరుగులు చేరాయి. కగిసో రబడా వేసిన తొలి బంతిని బంగ్లాదేశ్ ఓపెనర్ షెడమన్ ఇస్లామ్ వదిలేయగా.. కీపర్ చేతిలోకి వెళ్లింది.
రెండో బంతి వేసే క్రమంలో కగిసో రబడా ఓవర్ స్టెప్ అయ్యి నో బాల్ వేసాడు. ఆ బంతి కాస్త వికెట్ కీపర్‌ను ధాటి బౌండరీకి దూసుకెళ్లింది. దాంతో బంగ్లాదేశ్‌కు అప్పనంగా మరో 5 పరుగులు లభించాయి. ఇలా మొత్తం 10 పరుగులు ఒక్క బంతికే.. బంగ్లా బ్యాటర్ టచ్ చేయకుండా వచ్చి చేరాయి.
రూల్స్ ప్రకారమే..
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 41.2.11 ప్రకారం ఫీల్డ్ అంపైర్ సౌతాఫ్రికాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. ఈ రూల్ ప్రకారం అంపైర్లు తప్పు చేసిన ఆటగాడిని పలుమార్లు హెచ్చరిస్తారు. ముందుగా మందలిస్తారు. ఆ తర్వాత కెప్టెన్ సమక్షంలో జట్టులోని ఆటగాళ్లందరికి లాస్ట్ వార్నింగ్ అని చెబుతారు. అప్పటికీ అదే తప్పిదం చేస్తే 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు.
సౌతాఫ్రికా బ్యాటర్ ముతుసామీ విషయంలోనూ ఇదే జరిగింది. ముతుసామీ తప్పిదం.. రబడా నోబాల్ కారణంగా బంగ్లాదేశ్‌కు అప్పనంగా 10 పరుగులు లభించాయి. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రబడా నిప్పులు చెరగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 4 వికెట్లకు 38 పరుగులే చేసింది. ఇంకా 537 పరుగుల వెనుకంజలో ఉంది.