మిర్పూర్: వన్డే ప్రపంచకప్ ముందు బంగ్లాదేశ్ పర్యటనను న్యూజిలాండ్ విజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సెన్ షాంటో(84 బంతుల్లో 10 ఫోర్లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే(4/34) నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. కోల్ మెక్‌కోనిక్, ట్రెంట్ బౌల్ట్ రెండేసి వికెట్లు తీసారు. లూకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ యంగ్(80 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 70), హెన్రీ నికోల్స్(86 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్(2/32) రెండు వికెట్లు తీయగా.. నసుమ్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
హాఫ్ సెంచరీతో పాటు రెండు కీలక క్యాచ్‌లు అందుకున్న విల్ యంగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. హెన్రీ నికోల్స్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. ఈ సిరీస్ తొలి వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్ నుంచి నేరుగా న్యూజిలాండ్ వన్డే ప్రపంచకప్ కోసం భారత్‌కు రానుంది.
శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా పాకిస్థాన్‌తో ప్రపంచకప్ వామప్ మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతి లేదు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో సెక్యూరిటీ కల్పించలేమని పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. హెచ్‌సీఏ ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించేందుకు సిద్దమైంది.
కేన్ విలియమ్సన్ సారథ్యంలోనే న్యూజిలాండ్ వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్న అతను భారత్‌లో జట్టుతో కలవనున్నాడు.
న్యూజిలాండ్ వరల్డ్ కప్ టీమ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), ట్రెంట్ బౌల్డ్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లేన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ, టీమ్ సౌథీ, విల్ యంగ్.