
చటోగ్రామ్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్.. సోమవారం జరిగిన నామమాత్రపు చివరి వన్డేలో సమష్టి ప్రదర్శనతో 50 పరుగులతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(75, 4/35) ఆల్‌రౌండ్ షోతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 246 పరుగులకు కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్(71 బంతుల్లో 7 ఫోర్లతో 75), ముష్ఫీకర్ రహీమ్(93 బంతుల్లో 6 ఫోర్లతో 70), నజ్ముల్ హెస్సెన్ షాంటో(71 బంతుల్లో 5 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, సామ్ కరన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 196 పరుగుల కుప్పకూలి ఓటమిపాలైంది. జేమ్స్ విన్స్(44 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 38), క్రిస్ వోక్స్(46 బంతుల్లో 2 ఫోర్లతో 34), ఫిల్ సాల్ట్(25 బంతుల్లో 7 ఫోర్లతో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ జోస్ బట్లర్(26)తో పాటు ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తైజుల్ ఇస్లామ్, ఎబాదత్ హొస్సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ పడగొట్టారు. వరుసగా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ ఓడినా.. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడంతో 2-1తో బట్లర్ సేన సిరీస్ కైవస్ చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 300+ వికెట్లతో పాటు 6000 ప్లస్ పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా షకీబ్ అల్ హసన్ గుర్తింపు పొందాడు. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిత్ అఫ్రిది.. షకీబ్ కంటే ముందు ఈ ఘనత సాధించారు.