
షార్జా: ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన ఆ జట్టు గ్రూప్ బి టాపర్‌గా సూపర్-4కు అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. అఫ్గాన్ బ్యాటర్లు ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లతో 42 నాటౌట్), నజిబుల్లా జడ్రాన్(17 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 43 నాటౌట్) విధ్వంసకర ఆటతో జట్టును గెలిపించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. లోయరార్డర్ బ్యాటర్ మోసాద్దేక్ హోస్సెన్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్) చెలరేగడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. హోస్సెన్‌కు అండగా మహముదుల్లా(25) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అఫ్గాన్ స్పిన్ ద్వయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు.
అనంతరం లక్ష్య చేధరకు దిగిన అఫ్గాన్.. జడ్రాన్ ద్వయం పోరాటంతో 18.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 131 పరుగులు చేసింది. బంగ్లా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ ఓ దశలో ఓటమిదిశగా సాగింది. 24 బంతుల్లో 43 పరుగులు అవసరమవ్వడంతో ఆ జట్టు చేయడం కష్టమే అనిపించింది. కానీ ముస్తాఫిజుర్ వేసిన 17 ఓవర్‌లో నజిబుల్లా జడ్రాన్ రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సైఫుద్దిన్ వేసిన 18వ ఓవర్‌లో ఇబ్రహీమ్ జడ్రాన్ రెండు బౌండరీలు బాదగా నజిబుల్లా రెండు భారీ సిక్సర్లతో విజయం ఖాయం చేశాడు.
19వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. టాస్ గెలిచిన షకీబ్ అల్ హసన్ ఫీల్డింగ్ తీసుకోవడం ఆ జట్టు కొంపముంచింది. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయిన బంగ్లా.. బౌలింగ్‌లోనూ తడబడి మూల్యం చెల్లించుకుంది.