మిర్పూర్: టెస్ట్ క్రికెట్‌లో పసికూన బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల భారీ తేడాతో గెలిచిన మూడో జట్టుగా.. 21 శతాబ్ధంలో తొలి టీమ్‌గా చరిత్రకెక్కింది.
అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్ల జాబితాలో ఇంగ్లండ్ టాప్‌లో ఉంది.
1928లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత 1934లో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ రెండు భారీ విజయాల తర్వాత బంగ్లాదేశ్ తాజా విజయం ఈ జాబితాలోకి ఎక్కింది. ఈ క్రమంలో 1911లో ఆస్ట్రేలియా 530 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓడించిన రికార్డును బంగ్లాదేశ్ అధిగమించింది.

శనివారం ముగిసిన ఏకైక టెస్ట్‌లో 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 115 పరుగులకే కుప్పకూలింది. టస్కిన్ అహ్మద్(4/37), షోరిఫుల్ ఇస్లామ్(3/28) అఫ్గాన్ పతనాన్ని శాసించారు. మెహ్‌దీ హసన్ మీరాజ్, ఎబాడాట్ హోస్సెన్ తలో వికెట్ తీసారు. అఫ్గాన్ బ్యాటర్లలో రెహ్మత్ షా(30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు కుప్పకూలింది. నజ్ముల్ హోస్సెన్ షాంటో(175 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్స్‌లతో 146) సెంచరీతో రాణించాడు. అనంతరం బంగ్లాదేశ్ 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 425/4 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
నజ్ముల్ హోస్సెన్ షాంటో(151 బంతుల్లో 15 ఫోర్లతో 124), మోమినుల్ హక్(145 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 121 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేసిన నజ్ముల్ హోస్సెన్ షాంటోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.