లాహోర్: ఆసియాకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు దుమ్మురేపారు. సూపర్-4 చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో 335 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేశారు. ఓపెనర్ మెహ్‌దీ హసన్ మిరాజ్(119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112), నజ్ముల్ హొస్సెన్ షాంటో(105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 104) సెంచరీలతో చెలరేగారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇద్దరికి తోడుగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, గల్బాదిన్ నైబ్ తలో వికెట్ తీసారు. రషీద్ ఖాన్(0/66) దారుణంగా విఫలమయ్యాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు మహమ్మద్ నైమ్(28), మెహ్‌దీ హసన్ శుభారంభం అందించారు. పవర్ ప్లేలో చివరి బంతికి నైమ్ ఔటవ్వడంతో బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన టౌహిడ్ హృదయ్(0) సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షాంటోతో కలిసి మెహ్‌దీ హసన్ చెలరేగాడు.
ఈ ఇద్దరూ అఫ్గాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో మెహ్‌దీ హసన్ 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. ఆ కొద్దిసేపటికే షాంటో 101 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మెహ్‌దీ హసన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో మూడో వికెట్‌కు నమోదైన 194 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ కొద్ది సేపటికే నజ్ముల్ హుస్సెన్ రనౌటవ్వగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్పికర్ రహీమ్, షామిమ్ హుస్సెన్ కూడా రనౌట్‌గా వెనుదిరిగారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొత్తం ముగ్గురు బ్యాటర్లు రనౌటవ్వడం విశేషం. చివర్లో షకీబ్ అల్ హసన్ భారీ షాట్లతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.