టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు జల్లు కురిపించాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలను పెవిలియన్ చేర్చాడు. ఔట్ సిలబస్‌లా వచ్చి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
తన తొలి స్పెల్‌ను కట్టుదిట్టంగా పూర్తి చేయడంతో నితీష్ బౌలింగ్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిదా అయ్యాడు. తెలుగులో నితీష్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. 'బౌలింగ్ బాగుందిరా మావ'అంటూ కొనియాడాడు. అతని మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి తెలుగు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సూపర్ మామ అంటూ కామెంట్ చేస్తున్నారు. గిల్ తెలుగు మాటలకు తెలుగు కామెంటేటర్స్ కూడా ఫిదా అయ్యారు. శుభ్‌మన్ గిల్ మొత్తం తెలుగు నేర్చేసుకున్నాడని కొనియాడారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. నితీష్ కుమార్ రెడ్డికి ధాటికి 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. నితీష్ వేసిన తొలి ఓవర్‌లోనే జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి ఓలీ పోప్, జోరూట్ నిలకడగా ఆడటంతో ఇంగ్లండ్ 83/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకైక మార్పుతో బరిలోకి దిగింది. ప్రసిధ్ కృష్ణను తప్పించి జస్‌ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకుంది. కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.