
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబర్ ఆజామ్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. తనకు నచ్చని ప్రశ్నలు వేసిన వారిపై బాబర్ ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టీమ్‌లో సీనియర్లను బాబర్ పట్టించుకోడని, అతనికి అహం ఎక్కువని పాకిస్తాన్ క్రికెట్‌లో చర్చ జరుగుతుండగా మీడియా ముందు పాక్ సారథి వ్యవహరించిన తీరు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు పేలవమైన డ్రా గా ముగిసిన తర్వాత బాబర్ విలేకరుల సమావేశానికి వచ్చాడు. కరాచీ టెస్టు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. టెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. ఇక ప్రెస్ మీట్ నుంచి వెళ్లపోవడానికి లేస్తుండగా బాబర్‌ను ఓ జర్నలిస్టు.. 'ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడున్న వాళ్లు మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు.'అని అడిగాడు. దానికి బాబర్.. ఓరకంట చూస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో మీడియా మేనేజర్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేయడంతో బాబర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తాను మ్యాచ్ మొదటి నుంచి ఫలితం కోసమే ప్రయత్నిస్తామని చెప్పానని బాబర్ ఆజమ్ అన్నాడు. క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చని, అందుకే ఛాన్సులు తీసుకోవాలని అనుకున్నామని చెప్పాడు. తమ జట్టు బలం బ్యాటింగే అన్న బాబర్.. తొలి ఇన్నింగ్సులో అద్భుతంగా ఆడామని అభిప్రాయపడ్డాడు. 'నేను టాస్ సమయంలోనే చెప్పా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం వచ్చేలా చూస్తామని. అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా. కానీ లైట్ సరిగా లేకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. మా ఐదో బౌలర్ సల్మాన్ ఆఘాకు బాగలేదు. దీంతో అతన్ని చాలా మిస్ అయ్యాం. మా ఐదుగురు బౌలర్ల ఎటాక్ చాలా బాగుంది. వసీమ్, సవూద్ అద్భుతంగా ఆడి అవకాశాలు సృష్టించారు. మంచి ఆట ఆడినందుకు వాళ్లను మెచ్చుకోవాల్సిందే' అని బాబర్ చెప్పాడు.
ఇక కరాచీ టెస్టులో తొలుత పాక్ మొదటి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసింది. బదులుగా న్యూజిలాండ్ 612 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో పాక్.. 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 1 వికెట్ కోల్పోయి 61 పరుగులు సాధించడంతో. టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. కివీస్‌తో సిరీస్ కంటే ముందు పాకిస్థాన్.. ఇంగ్లండ్ చేతిలో మూడు టెస్టులు ఓడి తీవ్ర విమర్శల పాలైంది. అప్పుడు కూడా బాబర్ విలేకరులతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి.