PAK vs SA: దురదృష్టంతో పాటు బ్యాటింగ్‌లో చేసిన తప్పిదం తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. బ్యాటింగ్‌లో 10-15 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

దురదృష్టం కూడా తమను వెంటాడిందని చెప్పాడు. డీఆర్‌ఎస్ నిర్ణయం ప్రతీకూలంగా రావడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. చివరి వరకు పోరాడినా విజయం దక్కలేదు. బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువగా చేశాం. అయినా మా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. అయినా మమ్మల్ని దురదృష్టం వెంటాడింది. మాకు అనుకూలమైన ఫలితం దక్కలేదు. డీఆర్‌ఎస్ నిర్ణయం కూడా వ్యతిరేకమైంది. అది అంపైర్స్ కాల్ అయ్యింది. ఆటలో ఇవన్నీ సహజమే. ఈ ఓటమి మా జట్టులోని ప్రతీ ఒక్కరిని నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో మాకు గెలిచే అవకాశం దక్కింది.
అలాగే ఇది గెలిచి ఉంటే సెమీస్ ఆశలు కూడా సజీవంగా ఉండేవి. కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో సెమీస్ చేరే అవకాశాలు కూడా గల్లంతయ్యాయి. చివరి మూడు మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మూడు మ్యాచ్‌ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో ఎక్కడ ఉంటామో చూద్దాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 46.4 ఓవర్లలో 270 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(65 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), సౌద్ షకీల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/43) మూడు వికెట్లు తీయగా.. టబ్రైజ్ షంసీ(4/60) నాలుగు వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్ కోయిట్జీ(2/42)కి రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(93 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చివర్లో కేశవ్ మహరాజ్(21 బంతుల్లో 7 నాటౌట్), షంసీ(4 నాటౌట్) విలువైన పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ(3/45) మూడు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్(2/62), మహమ్మద్ వసీమ్(2/50), ఉసమా మిర్(2/45) రెండేసి వికెట్లు పడగొట్టారు.
హ్యారీస్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతికి షంసీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో పాకిస్థాన్ ఆటగాళ్లు గట్టి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో బాబర్ రివ్యూ తీసుకోగా.. రిప్లేలో అది అంపైర్స్ కాల్‌గా తేలింది. బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను ముద్దాడటంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు.
ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే షంసీ ఔటయ్యేవాడు. అప్పుడు సౌతాఫ్రికా 263 పరుగులకు కుప్పకూలి 7 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యేది.