కొలంబో: మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడమే తమకున్న ఏకైక సమస్యని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. ఈ ఒక్క బలహీనతను అధిగమిస్తే పాకిస్థాన్ జట్టుకు తిరుగుండదని చెప్పాడు. ఆసియాకప్ 2023లో భాగంగా నేడు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ జట్లు సూపర్ 4 మ్యాచ్ ఆడనున్నాయి.
ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజామ్.. భారత్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. శ్రీలంక వేదికగా ఆడిన అనుభవం ఈ మ్యాచ్‌లకు తమకు కలిసి వస్తుందని తెలిపాడు. 'మేం ఇటీవల శ్రీలంకలో చాలా క్రికెట్ ఆడాం. ఆసియాకప్ ముందు అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ జరిగింది. మా దేశ ఆటగాళ్లు చాలామంది లంక ప్రిమియర్ లీగ్‌లో ఆడారు.

ఈ అనుభవం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాకు కలిసొస్తోంది. టోర్నీలో చాలా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పటికీ.. షెడ్యూల్ మీద మాకు పూర్తి అవగాహన ఉంది. పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నాం. బౌలింగ్‌లో మాకు మంచి ఆరంభాలు దక్కుతున్నాయి. మధ్య ఓవర్లలో వికెట్లు తీయడంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాం.
కానీ మళ్లీ మా పేసర్లు మంచి ముగింపే ఇస్తున్నారు. ఒక బౌలర్ విఫలమైనా ఇంకో బౌలర్ అందుకుంటాడు. వాతావరణం మా చేతిల్లో లేని విషయం. ముందు రోజు ఎండ కాసింది. ప్రాక్టీస్ కూడా బాగా సాగింది. ఆదివారం కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. మ్యాచ్ సజావుగా జరుగుతుందని భావిస్తున్నాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ టోర్నీ లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వగా.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా సూపర్-4లో అడుగు పెట్టిన రెండు జట్లూ ఆదివారం మరోసారి తలపడుతున్నాయి. సూపర్ 4లో పాక్ ఇప్పటికే బంగ్లాదేశ్‌తో ఓ మ్యాచ్ ఆడి ఘనవిజయం సాధించింది. భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కూడా పాక్ బౌలర్లు దుమ్మురేపారు.
ఆరంభంలో, చివర్లో పేసర్లు విజృంభించి భారత్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేశారు. సూపర్-4 మ్యాచ్ పిచ్ కూడా బౌలర్లకే అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో భారత్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికీ.. లీగ్ దశలో మాదిరి ఫలితం రాని పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆదివారం మ్యాచ్ సాగకపోయినా.. సోమవారం రిజర్వ్ డే ఉంది.