PAK vs AFG: చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్ తమ ఘోర పరాజయానికి కారణమైందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పసికూన అఫ్గానిస్థాన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. వన్డే క్రికెట్‌లో అఫ్గాన్ చేతిలో పాకిస్థాన్‌కు ఇదే తొలి పరాజయం.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్ తమ ఓటమికి గల కారణాలను తెలియజేశాడు. బ్యాటింగ్‌లో రాణించినా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యామని తెలిపాడు. ఈ తరహా ఫీల్డింగ్, బౌలింగ్‌తో విజయం సాధించడం కష్టమని చెప్పాడు. తదుపరి మ్యాచ్‌లోనైనా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపాడు.

'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మంచి లక్ష్యాన్ని నమోదు చేశాం. కానీ బౌలింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాం. ఒక్క విభాగంలో మెరుగ్గా లేకపోయినా విజయాన్ని అందుకోలేం. ఫీల్డింగ్‌లో చాలా బౌండరీలను ఆపలేకపోయాం. పరుగులను నియంత్రించలేకపోయాం.
అవి మాకు తీరని నష్టం చేశాయి. బౌలింగ్‌లో మెరుగ్గానే ప్రారంభించినా.. మిడిల్ ఓవర్లలో మాత్రం కావాల్సిన వికెట్లు తీయలేకపోయాం. అఫ్గానిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. మూడు విభాగాల్లో సత్తా చాటి అసాధారణ విజయాన్ని అందుకుంది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మేం మెరుగ్గా రాణించలేకపోయాం. తదుపరి మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్(92 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 74), అబ్దుల్లా షఫీక్(75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో నూర్ అహ్మద్(3/49) మూడు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్(2/52) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ నబీ, అజ్మతుల్లాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లలో2 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసి గెలుపొందింది. ఇబ్రహీమ్ జడ్రాన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 87), రెహ్మానుల్లా గుర్బాజ్(53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 65), రెహ్మత్ షా(84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
హష్మతుల్లా(45 బంతుల్లో 4 ఫోర్లతో 48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, హసన్ అలీకి తలో వికెట్ దక్కింది.