మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో ఓటమిపాలయ్యామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. తాను ఔటయ్యేవరకు గేమ్ తమ చేతిలోనే ఉందని, మిడిలార్డ్ బ్యాటర్లు జట్టును ఆదుకోలేకపోయారని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌ముందు సన్నాహకంగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన నాలుగు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ 0-2తో కోల్పోయింది.
ఈ సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజామ్(22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36), ఉస్మాన్ ఖాన్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(2/35), ఆదిల్ రషీద్(2/27), లివింగ్ స్టోన్(2/17) రెండేసి వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి 27 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఫిల్ సాల్ట్(24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), జోస్ బట్లర్(21 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 39) రాణించారు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్ ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బాబర్ ఆజామ్.. ఈ తప్పిదాలను సరిదిద్దుకొని టీ20 ప్రపంచకప్ 2024లో సత్తా చాటే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. 'ఆరు ఓవర్ల వరకు మేం అద్భుతంగా బ్యాటింగ్ చేశాం. కానీ నేను ఔటైన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. మిడిలార్డర్ జట్టును ఆదుకోవాల్సింది. కానీ ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
మాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. టీ20 ప్రపంచకప్ ముందు మేం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటాం. జట్టులో కొందరికి గాయాలైనా ఈ సిరీస్ ద్వారా మాకు అనేక సానుకూలంశాలు లభించాయి. మా జట్టు ప్రదర్శన బాగానే ఉంది. కానీ విజయం కావాలంటే 100 శాతం పోరాడాలి.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దవ్వగా.. మరో రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది.
జూన్ 2న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న ఆతిథ్య అమెరికాతో ఆడనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.