
కరాచీ: బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ 0-3తో క్లీన్ స్వీప్ అయిన విషయం తెలిసిందే. మంగళవారం ముగిసిన మూడో టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో బాబర్ సేన చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. కీలక సమయంలో పుంజుకున్నా తమ పోరాటం సరిపోలేదన్నాడు. ఇంగ్లండ్ అద్భుతంగా ఆడిందని.. ఈ విజయానికి వారు పూర్తి అర్హులని చెప్పాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడకపోవడం నష్టం చేసిందన్నాడు. తమ ప్రధాన బౌలర్లు ఫిట్‌గా లేకపోవడం కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందని బాబర్ చెప్పుకొచ్చాడు.
'జట్టుగా ఈ ఓటమి చాలా బాధగా ఉంది. మేం తిరిగి పుంజుకోని గట్టి పోరాటం చేయలేకపోయాం. ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం మాకు నష్టం చేసింది. మా బౌలర్లు అద్భుతంగా పోరాడినప్పటికీ దురదృష్టవశాత్తు అది సరిపోలేదు. ఈ సిరీస్‌లో ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. వీటిని తదుపరి సిరీస్‌లో కొనసాగిస్తాం. అలాగే మేం చేసిన తప్పిదాలను కూడా సవరించుకుంటాం'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్(35 నాటౌట్), జాక్ క్రాలీ(41) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. 112/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. మరో 11.1 ఓవర్లలోనే మిగిలిన 55 పరుగులు చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. టీ20 తరహాలో సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను హరీ బ్రూక్ అందుకున్నాడు.
ఈ సిరీస్ ఓటమితో బాబర్ ఆజామ్ తన పేరిట చెత్త రికార్డు లిఖించుకున్నాడు. పాకిస్థాన్ సారథిగా సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన తొలి కెప్టెన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.