టాప్-4 కాదు.. ప్రపంచకప్ గెలుస్తాం: బాబర్ ఆజామ్
కరాచీ: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టాప్-4లో నిలవడమనేది తమకు చిన్న లక్ష్యమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. విజేతలుగా తిరిగిరావడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ నేపథ్యంలో బాబర్ ఆజామ్ తన కెరీర్‌లో తొలిసారి భారత్‌లో పర్యటించనున్నాడు.
అతనే కాదు ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న చాలామంది ఆటగాళ్లకు ఇదే మొదటి పర్యటన. ఉపఖండ పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న పాక్ జట్టుపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ప్రపంచకప్‌లో ఆడేందుకు భారత్‌కు బయలుదేరేముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బాబర్ అజామ్ మాట్లాడాడు. ఇంతకుముందులా భారత్‌లో ఆడకపోవడాన్ని తాము ఒత్తిడిగా భావించడం లేదని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ కోసం అన్ని విధాల సిద్దమయ్యామని తెలిపాడు. కెప్టెన్‌గా ప్రపంచకప్ బరిలోకి దిగుతుండటం గర్వంగా ఉందన్నాడు.
'ప్రపంచకప్ కోసం వెళ్తున్నందుకు గర్వంగా ఉంది. ఇంతకుముందులా భారత్‌లో ఆడకపోవడాన్ని ఒత్తిడిగా భావించట్లేదు. మెగా టోర్నీ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యాం. భారత్ పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేశాం. వరల్డ్ కప్ కోసం ఈసారి నేను కెప్టెన్‌గా వెళ్తుండటం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా.
ఈసారి ట్రోఫీతో తిరిగి వస్తామనే ధీమాతో ఉన్నా. టాప్-4లో నిలవడమనేది మాకు చిన్న లక్ష్యం. మేము విజేతలుగా తిరిగి రావాలనుకుంటున్నాం. కొన్ని నెలల నుంచి విరామం లేకుండా ఆడటం వల్ల ప్రపంచ కప్‌కు ముందు ఒక క్యాంప్ ఏర్పాటు చేయడానికి మాకు తగినంత సమయం దొరకలేదు. మేము ఆటగాళ్లకు విరామం ఇవ్వాలని కోరుకున్నాం.
తద్వారా వారు రిఫ్రెష్ అయి గెలవాలనే పట్టుదలతో తిరిగి వస్తారు. అలా గెలవాలనే కసి ఉన్నప్పుడు బాగా ఆడతారనేది మా నమ్మకం. ప్రేక్షకులతో నిండిపోయే అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా సామర్థ్యానికి తగ్గట్లు ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రతి ప్రపంచకప్ ప్రదర్శన భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. హీరోగా మారేందుకు ఇదో సువర్ణావకాశం' అని బాబర్ అజామ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications