కొలంబో: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్నివ్వడమే తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. తమ పేస్ త్రయానికి తగ్గట్లు భారత ఓపెనర్లు పకడ్బందీగా ప్రిపేరయ్యారని, ఎదురు దాడికి దిగి ఒత్తిడిలోకి నెట్టారని చెప్పాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా 228 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ ఘోర పరాజయంపై మ్యాచ్ అనంతరం స్పందించిన బాబర్ ఆజామ్.. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం కొంపముంచిందని తెలిపాడు. రోహిత్-శుభ్‌మన్ గిల్ అందించిన శుభారంభాన్ని విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కొనసాగించారని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

'వాతావరణం మన చేతుల్లో లేని అంశం. అయినా మేం మా సాయశక్తులా పోరాడాం. ఈ మ్యాచ్‌లో మేం మా స్థాయికి తగ్గట్లు బౌలింగ్, బ్యాటింగ్ చేయలేదు. మా బౌలర్లకు తగ్గట్లు భారత ఓపెనర్లు పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగారు. ఎదురు దాడికి దిగి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ శుభారంభాన్ని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొనసాగించారు. దాంతో మా బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు.
భారత బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి 10 ఓవర్లలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేశారు. మా బ్యాటింగ్ పరమ చెత్తగా సాగింది.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసి ఓటమికి అంగీకరించింది. నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ గాయపడటంతో బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(5/25) ఐదు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.