Babar Azam, ENG vs PAK: వన్డే ప్రపంచకప్ 2023లో తమ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసిందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే కథ వేరేలా ఉండేదని, సెమీస్‌కు అర్హత సాధించేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 93 పరుగులు తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్.. కెప్టెన్‌గా జట్టు కోసం తన అనుభవాన్నంతా ఉపయోగించి చేయాల్సిందల్లా చేశానని తెలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో తడబడ్డామని చెప్పాడు. 'ఈ టోర్నీలో మా ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మేం విజయం సాధించి ఉంటే కథ మరోలా ఉండేది.

ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మేం తప్పిదాలు చేశాం. బౌలింగ్‌లో అదనంగా 20-30 పరుగులు ఇచ్చాం. చెత్త బంతులను వేసాం. మా స్పిన్నర్లు వికెట్లు తీయలేదు. ఇది మా ఓటమిని శాసించింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు వికెట్లు తీయకపోతే ఏం చేయలేం. మేం మా ప్రదర్శనను సమీక్షించుకుంటాం. మా తప్పిదాలు.. సానుకూలంశాల గురించి చర్చించుకుంటాం. కెప్టెన్‌గా జట్టు కోసం నా సాయశక్తులా కృషి చేశాను.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలిచేది. ఇంగ్లండ్‌తో పోరులో పాకిస్థాన్ తేలిపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ధాటిగా ఆడి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్(76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84), జో రూట్(72 బంతుల్లో 4 ఫోర్లతో 60), జానీ బెయిర్‌స్టో(61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.
హ్యారీస్ రౌఫ్(3/59) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది(2/72), మహమ్మద్ వాసీమ్(2/74) రెండేసి వికెట్లు పడగొట్టారు.. ఇఫ్తికర్ అహ్మద్(1/38)కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులకు కుప్పకూలింది. అఘా సల్మాన్(45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
బాబర్ ఆజామ్(38), మహమ్మద్ రిజ్వాన్(36), స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. చివర్లో హ్యారీస్ రౌఫ్(35) మెరుపులు మెరిపించి 53 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, గస్ అట్కిన్సన్, మొయిన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు.