PAK vs BAN: సమష్టి ప్రదర్శనతోనే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తమ ఆటగాళ్లు సత్తా చాటరని కొనియాడాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను పాకిస్థాన్ సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన బాబర్ ఆజామ్( Babar Azam) సంతోషం వ్యక్తం చేశాడు. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశాడు.

'మా కుర్రాళ్లు అదరగొట్టారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఫామ్‌లోకి వస్తే ఫకార్ జమాన్ ఎలా ఆడుతాడో మాకు బాగా తెలుసు. ఈ మ్యాచ్‌ల్లో అతను రాణించడం చూడ ముచ్చటగా ఉంది. చివరి రెండు మ్యాచ్‌లను కూడా గెలిచేందుకు మేం ప్రయత్నిస్తాం. అప్పుడు మా పరిస్థితి ఏందో చూసుకుంటాం(సెమీస్ అవకాశాలపై). ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ ఉత్సాహంతో తదుపరి మ్యాచ్‌ల్లో సత్తా చాటుతాం.
షాహిన్ షా అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 15-20 ఓవర్ల తర్వాత బంగ్లా బ్యాటర్లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ మా ప్రధాన బౌలర్లు అడ్డుకున్నారు. గుడ్ లెంగ్త్‌లో వేసి వికెట్లు తీసారు. మైదానానికి వచ్చి మా జట్టుకు మద్దతు తెలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహ్మదుల్లా(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(64 బంతుల్లో 6 ఫోర్లతో 45), షకీబ్ అల్ హసన్(64 బంతుల్లో 4 ఫోర్లతో 43) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మహమ్మద్ వసీమ్ మూడేసి వికెట్లు తీయగా.. ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసి 105 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), ఫకార్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీహసన్ మీరాజ్(3/60) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.
ఈ గెలుపుతో పాకిస్థాన్.. పాయింట్స్ టేబుల్‌లో అఫ్గాన్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానానికి చేరింది. మరోవైపు ఈ ఓటమితో బంగ్లాదేశ్.. సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఏడు మ్యాచ్‌ల్లో 6 ఓడిన బంగ్లాదేశ్.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరలేదు.