హంబంటోట: సమష్టి ప్రదర్శనకు తోడు నసీమ్ షా సూపర్ బ్యాటింగ్ తమ విజయానికి కారణమని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో గురువారం ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. టెయిలెండర్ నసీమ్ షా సంచలన బ్యాటింగ్‌తో పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉడగానే కైవసం చేసుకుంది.
ఈ విజయంపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్.. ఈ గెలుపు తమ బ్యాటింగ్ డెప్త్‌కు నిదర్శనమని చెప్పాడు. 'ఈ విజయం క్రెడిట్ మా కుర్రాళ్లదే. నేను, ఇమామ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించాం. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నాం. చివరి 10 ఓవర్లలో మా విజయానికి 80-90 పరుగులు చేయాల్సి వస్తదని ముందే గ్రహించాం.

నసీమ్ షా జట్టు విజయానికి కావాల్సిన పరుగులు చేయగలడని నమ్మాం. ప్రతికూల పరిస్థితుల్లోనూ అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నేను నా వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తాను. ఏ రోజు కూడా నా ప్రదర్శనపై సంతృప్తి చెందను. నా స్కిల్స్ పట్ల నేను ఎప్పుడూ దిగులు చెందను. ప్రతీసారి నా స్కిల్స్‌ను నమ్ముకొని బరిలోకి దిగుతా. చివరి మ్యాచ్‌పైనే మా ఫోకస్ ఉంది.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. రెహ్మనుల్లా గుర్బాజ్(151 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 151) సెంచరీతో చెలరేగగా.. ఇబ్రహిమ్ జడ్రాన్(101 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఉసామా మిర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(105 బంతుల్లో 4 ఫోర్లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. బాబర్ ఆజామ్(66 బంతుల్లో 6 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో షాదాబ్ ఖాన్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 48), నసీమ్ షా(5 బంతుల్లో 2 ఫోర్లతో 18) విలువైన పరుగులు చేశారు.