న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రపంచ రికార్డు సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో (53) హాఫ్ సెంచరీ సాధించిన బాబర్ ఆజామ్.. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అఫ్గాన్‌తో రెండో వన్డే.. బాబర్ ఆజామ్‌కు 100వ ఇన్నింగ్స్.
ఇప్పటి వరకు బాబర్ ఆజామ్ 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 5,142 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం హసీం ఆమ్లా పేరిట ఉండేది. అతను 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4946 పరుగులు చేశాడు. తాజాగా బాబర్ ఆజామ్ ఈ ఘనతను అధిగమించాడు. ఈ జాబితాలో బాబర్ ఆజామ్, ఆమ్లా తర్వాత వివ్ రిచర్డ్స్(4607), షైహోప్(4436), జోరూట్(4428) కొనసాగుతున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 100 ఇన్నింగ్స్‌ల్లో 4230 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లీ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. అఫ్గాన్‌తో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాకిస్థాన్ 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
బాబర్ ఆజామ్ వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 18 సెంచరీలు.. 27 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. రెహ్మనుల్లా గుర్బాజ్(151 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 151) సెంచరీతో చెలరేగగా.. ఇబ్రహిమ్ జడ్రాన్(101 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఉసామా మిర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(105 బంతుల్లో 4 ఫోర్లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. బాబర్ ఆజామ్(66 బంతుల్లో 6 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో షాదాబ్ ఖాన్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 48), నసీమ్ షా(5 బంతుల్లో 2 ఫోర్లతో 18) విలువైన పరుగులు చేశారు.