టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పాకిస్థాన్‌లో మంచి పాపులారిటీ ఉందని ఆ జట్టు మాజీ క్రికెటర్ అజార్ అలీ అన్నాడు. ఇప్పటి వరకు పాక్ గడ్డపై కోహ్లీ ఒక్క మ్యాచ్ ఆడకపోయినా.. అతన్ని అభిమానించేవారి సంఖ్య కోట్లలో ఉందని చెప్పాడు.
2006లో భారత అండర్ 19 జట్టు తరఫున పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. అసాధారణ ప్రదర్శనతో వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోనూ అతన్ని ఆదరించే అభిమానుల సంఖ్య పెరిగింది.

పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో చాలా సార్లు కోహ్లీ జెర్సీలతో పలువురు ఫ్యాన్స్ కనిపించారు. విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న పాకిస్థాన్ టీమ్ జెర్సీలను ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఆదివారం హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ బిగ్ మ్యాచ్ నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన అజార్ అలీ.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీ ఆడితే మైదానాలన్నీ కోహ్లీ జెర్సీలతో నిండిపోతాయని చెప్పాడు. 'పాకిస్థాన్‌లో లాహోర్, కరాచీ, రావాల్పిండి, ముల్తాన్ మైదానాల్లో విరాట్ కోహ్లీ ఆడినప్పుడే ఇక్కడ అతనికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఏవరూ నమ్మలేని స్థితిలో అతనికి ఆదరణ ఉంటుంది. స్టేడియం మొత్తం పచ్చ జెర్సీలతో నిండిపోయినా.. వాటిపై బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిది పేర్లు కాకుండా విరాట్ కోహ్లీ పేరు, అతని జెర్సీ నెంబర్ 18 ఉంటుంది.
అతను ఫామ్ కోల్పోయినప్పుడు నేను ఎన్నో ప్రార్థనలు చేశాను. అలా ఎందుకు చేశానో నాకు తెలియదు. కానీ గత మూడేళ్లుగా కోహ్లీ కోసం నేను ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను విమర్శించేవారంతా గత 15 ఏళ్లుగా అతను ఏం చేశాడో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అతను విఫలమైన ప్రతీసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అతనిలా రాణించిన బ్యాటర్‌ను నేను చూడలేదు.'అని అజార్ అలీ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మెగాటోర్నీలో పాక్‌తో 5 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ నాలుగు హాఫ్ సెంచరీలతో 308 పరుగులు చేశాడు.