
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ ఇద్దరిని ఎంపిక చేయలేదని చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. అయితే పెళ్లి కోసమే కేఎల్ రాహుల్ ఈ రెండు సిరీస్‌లకు దూరంగా ఉన్నాడనే విషయం అందరికి తెలిసిందే. తన ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో రాహుల్ పెళ్లి ఈ నెల 23న జరగనుంది. అయితే స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా పెళ్లి కోసం ఈ రెండు సిరీస్‌లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తన ప్రియురాలైన మేహా పటేల్‌ను అక్షర్ పటేల్ ఈ నెలలోనే వివాహం చేసుకోనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. అక్షర్ చాలా కాలంగా మేహా పటేల్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. గతేడాది తన పుట్టినరోజు (జనవరి 20) సందర్భంగా మేహాకు రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అక్షర్ పటేల్ ఫియాన్సీ మేహా వృత్తి రీత్యా డైటిషియన్, న్యూట్రిషనిస్ట్. అక్షర్ పటేల్ డైట్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
అంతేకాకుండా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మేహా చేతిపై 'AKSH'అని టాటూ కూడా వేయించుకుంది. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లకు హాజరైన మేహా గ్యాలరీలో సందడి చేసింది. ఈ ఇద్దరి ప్రేమాయణాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించాయని, వారి సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే వివాహ తేదీ తెలియాల్సి ఉంది.
ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా ఇరు కుటుంబాల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని ఈ జోడీ భావిస్తున్నట్లు సమాచారం. పెళ్లి అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసి అందర్ని పిలవాలనుకుంటుందంట. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న అక్షర్ పటేల్.. టీ20 సిరీస్‌తో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాడు. తిరువనంతపురం వేదికగా ఆదివారం చివరి వన్డే జరగనుంది.